- కోర్టు ధిక్కరణ కేసులో ఆన్‌లైన్‌లో హాజరైన సందీప్ కుమార్ సుల్తానియా
- ప్రత్యక్షంగా హాజరవ్వకపోవడంపై అసహనం..
- ఎలా వ్యవహరించాలో తెలియదా అంటూ జడ్జి ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏప్రిల్ 9లోగా చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. గడువులోగా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌సుల్తానియాను హెచ్చరించింది. పెండింగ్ లో ఉన్న 2,600 మందికి సొమ్ము చెల్లించాలని, లేదంటే ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాలంటూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన దాదాపు 654 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ జరుగుతున్నందున ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నారని, హాజరు మినహాయింపునకు అనుమతించాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరించడంతో సాయంత్రం సందీప్‌కుమార్ సుల్తానియా ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తానియా ప్రవర్తనపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్‌లో మీరే సందీప్‌కుమార్ సుల్తానియా అని ఎలా అనుకోవాలని ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదా..? అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి 6 నుంచి 9 నెలల గడువు ఇచ్చినా విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. ఇప్పటికే 80 మందికిపైగా చనిపోయారని, కోర్టు ఉత్తర్వుల అమలుపై మీ సమాధానమేంటని ప్రశ్నించారు. సందీప్‌కుమార్ వివరణ ఇస్తూ మొత్తం 3,656 మందికి టోకెన్లు జారీ చేశామని, 1,056 మందికి చెల్లింపులు జరిగాయని, మరో 2,600 మందికి చెల్లించాల్సి ఉందన్నారు.
నగదు లేనందున వారికి చెల్లించకపోతున్నామని చెప్పడంతో.. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాటన్నింటితో సంబంధంలేదని, ఒక తేదీ చెప్పాలన్నారు. దీంతో 4 వారాల గడువు ఇస్తే వెసులుబాటు ఉంటుందని, లేదంటే కోర్టు ఒత్తిడి చేస్తే ఈనెల 31లోగా చెల్లిస్తామని సుల్తానియా తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు ఆదేశిస్తే చెల్లిస్తామనడం సరికాదని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. 4 వారాల గడువు కుదరదని, ఏప్రిల్ 9లోగా 2,600 మందికి రిటైర్మెంట్బెనిఫిట్స్ చెల్లింపులు జరుపుతామన్న హామీని రికార్డు చేస్తున్నామన్నారు. ఒకవేళ చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ప్రతి విచారణకు మీరు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
