
- అడ్డుకున్న పోలీసులు.. విద్యార్థుల అరెస్టు
ఓయూ, వెలుగు: ఓయూ వీసీ ప్రొఫెసర్రవీందర్పదవీ విరమణ సభ కొనసాగుతుండగా.. మరో వైపు విద్యార్థులు వర్సిటీకి పట్టిన దరిద్రం వదిలిందంటూ ఆర్ట్స్కాలేజీ వద్ద స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఇంకొందరు విద్యార్థి నేతలు పరిపాలనా భవనంలోకి చొచ్చుకునివెళ్లి సెనెట్హాల్లో వీసీ పదవీ విరమణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ..
మూడేండ్ల కాలంలో వర్సిటీలో వీసీ చేపట్టిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వందశాతం ఫీజులు పెంచి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. వర్సిటీ హాస్టళ్లల్లో అనేక సమస్యలు ఉన్నాయని, లేడీస్హాస్టళ్లలో రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేడీస్హాస్టళ్లలోకి దొంగలు చొరబడిన ఘటనలను పట్టించుకోలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధ్యాపకుల పదోన్నతుల్లో అక్రమాలు, నిధుల గోల్ మాల్, దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వీసీ పదవీ విరమణతో వర్సిటీకి పట్టిన శని తొలగిందన్నారు..
చాలా ఆనందంగా ఉంది.. మాజీ వీసీ రవీందర్
తన తల్లిదండ్రులు జన్మనిచ్చి 20 ఏండ్లు పెంచితే.. ఉస్మానియా యూనివర్సిటీ 40 ఏండ్ల పాటు పోషించి, వీసీని చేసిందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మాజీ వీసీ ప్రొఫెసర్రవీందర్ అన్నారు. విద్యార్థిగా వర్సిటీలో అడుగుపెట్టి.. వీసీ హోదాలో రిటైర్ అవుతున్నానని, తన ప్రస్థానంలో ఎన్నో కీలక మైలురాళ్లు, అనుభవాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. వీసీగా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. 21 పాయింట్స్ ఎజెండాతో వచ్చే 30 ఏండ్లకు సరిపడా మౌలిక వసతుల కల్పనకు కృషి చేసినట్టు తెలిపారు. హాస్టళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, సెంటినరీ పైలాన్ నిర్మాణం, ఆర్ట్స్ కాలేజీ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేశానన్నారు.