TSPSC : కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ

TSPSC : కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ

TSPSC పేపర్ లీకేజీ కేసు విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్న కొంతమందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐ, ఈడీ, ఏసీబీతో కలిసి సిట్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై ఫిర్యాదు చేసేందుకు గత రెండు, మూడు రోజులు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్ మెంట్ అడిగినా.. తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని మీడియా ద్వారా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీ కుంభకోణం, ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇతర దేశాల్లోనూ మూలాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఈ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి.. ఎదురుదాడి చేస్తూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్దం అన్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే.. నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి.. రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిందన్నారు. తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలు జరిగినప్పుడు.. అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపించినప్పుడు... వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సిట్ ను నియమిస్తోందని చెప్పారు. ఇప్పటివరకూ వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు. 

ప్రశ్నపత్రాల కుంభకోణంలో ఉన్న పాత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. TSPSC పేపర్ లీకేజీకి, తనకు ఉన్న సంబంధం గురించి కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించి.. అర్హత లేని వాళ్లను TSPSC కమిషన్ సభ్యులుగా నియమించారని ఆరోపించారు. TSPSC చైర్మన్, ఏడు మంది సభ్యుల నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారని చెప్పారు.  
‘‘గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూపు 1 పరీక్షలను నిర్వహించారు. లాలాగూడాలోని ఒక పరీక్షా  కేంద్రంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గ్రూపు 1ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంటే... ఒంటి గంట నుంచి 3 గంటల 30 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించారు. కావాల్సిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి.. పరీక్షలను రాయించారు. ఇతర కేంద్రాల్లోనూ కొంతమంది అభ్యర్థులకు అదనంగా సమయం కేటాయించి.. ఇతర వ్యక్తులతో పరీక్షలు రాయించారు. ఈ వివరాలను కప్పిపుచ్చారు. దీనిపై మరునాడు కొన్ని పత్రికల్లో కథనాలు వస్తే.. సంబంధిత అధికారులు వివరణ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాను కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చింది’’ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

లీకేజీ విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు (ప్రవీణ్, రాజశేఖర్ ) సంబంధించినదని మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిట్ నియమించిన తర్వాత ఈ విషయాన్ని కేటీఆర్ ఎలా చెప్పారన్నారు. కస్టడీలోకి తీసుకోకముందే ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెప్తారని మరోసారి ప్రశ్నించారు. ఈ ఇష్యూలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే అని అన్నారు. లీకేజీ వ్యవహారంతో కేటీఆర్ కు సంబంధం లేనప్పుడు.. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో.. నివేదిక ఇంకా పూర్తి కాకముందే.. మంత్రి కేటీఆర్ కు పూర్తి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ వద్ద నిర్ధిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా... తమపై క్రిమినల్ కేసులు పెడుతామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

‘‘సిట్ మాకు నోటీసులు ఇస్తోంది.. కేటీఆర్ కు విచారణ చేసిన రహస్య సమాచారాన్ని ఇస్తున్నారు. సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోంది. పేపర్ లీకేజీల్లో జరిగిన లావాదేవీలను, ప్రమేయం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. నేరాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఆరోపణలు కేటీఆర్ పైనే చేస్తున్నాం. కేటీఆర్ కు సమాచారాన్ని ఎవరు ఇస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.