బీఆర్ఎస్, బీజేపీ కవల పిల్లలు.. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీ కవల పిల్లలు.. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు: రేవంత్ రెడ్డి

రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని..  రూ.23 లక్షల కోట్ల తెలంగాణ సంపద ఎక్కడికి పోయిందని టీపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పిచ్చే.. సచివాలయం నిర్మాణమని ఆయన చెప్పారు. మూసీని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. బర్లు, గోర్లు, చేపలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. దశాబ్దకాలంలో  చేసిన వినూత్న పనులేమిటో కేసీఆర్ చెప్పాలన్నారు. నిజాంకు కేసీఆర్ కు తేడా లేనేలేదని,  దోపిడి దొంగల కన్నా..  కేసీఆర్ చాలా దుర్మార్గుడని అన్నారు రేవంత్ రెడ్డి.

2023, నవంబర్ 9వ తేదీ గురువారం వీ6  మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  "ప్రజల నుంచి మేము ఊహించని స్పందన వస్తోంది. 20 ఏళ్లుగా నేను రాజకీయంలో ఉంటున్న..  ఈ స్పందన ఎప్పుడూ చూడలేదు.  కేసీఆర్ మోసాలను ప్రజలు గమనించారు.  ఏ ఒక్కరినీ కదిలించినా కాంగ్రెస్ కే ఓటు వేస్తామని చెబుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేని కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తరు.  కాళేశ్వరం అవినీతి బట్టబయలు అవుతోంది. కొత్త ప్రాజెక్టులు ఏవైనా కేసీఆర్ పూర్తి చేశారా?. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చి ఆగం చేశారు.  బీఆర్ఎస్-, బీజేపీ కవల పిల్లలు. 

ఉద్యోగ  నోటిఫికేషన్లు ఇవ్వరు.. ఇస్తే లీకులు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశాడు. కవిత ఓడిపోతే ఆరు నెలల గడవక ముందే ఎమ్మెల్సీని  చేశాడు. కేసీఆర్ కు అవకాశం వస్తే.. మనువడిని కూడా మంత్రిని చేస్తాడు. ప్రగతి భవన్ లోకి సామాన్యులకు ఎంట్రీ లేదు. తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ ను కూడా కేసీఆర్ ప్రగతి భవన్ లోకి రానివ్వలేదు. కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలకే నిధులను మళ్లించారు. 

2004లోనే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది. 3 గంటల కరెంటుపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని నాశనం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు సామాంత రాజులుగా మారిపోయారు. పండుగ సమయంలోనే రైతుబంధు నిధులు వేస్తారు. ఓ చేతితో ఇచ్చి.. మరో చేతితో గుంజుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లపై సబ్సిడి ఎత్తివేశారు.హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 

కేసీఆర్ పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకం ఉంది. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు.  స్వేచ్ఛను హరిస్తే ప్రజలు తిరుగుబడుతారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజలకు చేరువయ్యాయి. కాంగ్రెస్ వస్తే.. స్వేచ్ఛ ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ సునామీ కన్పిస్తోంది. మార్పు రావాలని ప్రజల్లో బలంగా ఉంది. కేసీఆర్ ను గద్దె దించుతామనే నమ్మకం ఉంది" అని చెప్పారు.