
- మునుగోడు బైపోల్‌లో బీఆర్‌ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదు
- ఎన్నికలో ఖర్చు చేసిన ప్రతి పైసా కార్యకర్తలు ఇచ్చిందేనని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ‘‘మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ డబ్బు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నరు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే’’అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్, కేసీఆర్ నుంచి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. ఈటల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ విశ్వసించే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రమాణం చేస్తా. లేకపోతే ఏ ఆలయంలో నైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాపై చేసిన ఆరోపణలను ఈటల నిరూపించడానికి సిద్ధమా?’’అని రేవంత్ సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈటల సిద్ధంగా ఉండాలని చెప్పారు. రాజకీయాల కోసం దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమని, ఈటల చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. ‘‘పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, ఏఐసీసీ కార్యదర్శులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కల సమక్షంలో డబ్బులు సమకూర్చుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చిందే. ఆర్థిక సాయం అందించిన వారిలో పార్టీలోని బలహీన వర్గాల నాయకులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ మంది ఉన్నారు. వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడటం సమంజసం కాదు”అని రేవంత్ అన్నారు.