
- కాంట్రాక్టుల కోసమే పోయిండు
- నీ బంధాలన్నీ ఆర్థిక బంధాలే..
- మునుగోడులో కాంగ్రెస్ పార్టీనే అభ్యర్థి
- బై ఎలక్షన్‌కు కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో పేగు బంధం తెగిపోయిందని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ, అమిత్ షా ఇచ్చిన కాంట్రాక్టుల కోసం పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీపై ఈడీ కేసులతో కేంద్రం కక్ష సాధిస్తుంటే, ఆ చర్యలకు పాల్పడుతున్న వారితో పోరాడాల్సిందిపోయి కాంట్రాక్టుల కోసం అగ్రిమెంట్ చేసుకున్నాడని విమర్శించారు. బీజేపీ తన నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రారంభిస్తే, మోడీ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ నాణేనికి బొమ్మా, బొరుసని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనపై మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు చేయి గుర్తును చూసి, సోనియా గాంధీ ప్రతినిధిగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించారని అన్నారు. ఇబ్బందులు ఉంటే అధిష్టానానికి చెప్పేందుకు అవకాశం ఉందన్నారు. కానీ ‘మీ బంధం, అనుబంధం, ఆర్థిక బంధాలే అని అర్థమయ్యాయి’ అని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సోనియాగాంధీని అవమానించి బీజేపీ పంచన చేరిన ఆయన్ను ఎవరూ క్షమించరన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమైందని చెప్పారు. పార్టీనే బలమైన క్యాండిడేట్ అని స్పష్టం చేశారు.
5న మునుగోడులో విస్తృత స్థాయి మీటింగ్
మునుగోడు బై ఎలక్షన్కోసం ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించిందని రేవంత్ అన్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గంలో విస్తృతస్థాయి పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నేటి ఉదయం నుంచే నల్గొండ, యాదాద్రి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు మునుగోడులో విస్తృత స్థాయిలో పర్యటించాలని పిలుపునిచ్చారు. రాజీనామా చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చేయనిది ఏమైనా ఉందా? అని నిలదీసారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ పదవులు ఇచ్చిందని చెప్పారు. ‘ఈ రోజు బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా పనికిరారు’ అని విమర్శించారు. ఎంపీ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని రేవంత్ అన్నారు. పార్టీ సీనియర్లతో జరిగిన కీలక భేటీలో ఇదే అంశాన్ని ఆయన స్పష్టం చేశారని చెప్పారు. ‘‘ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మారిపోయింది. ప్రధాని మోడీ ముఠాలతో రావొచ్చు, ఈడీలతో రావొచ్చు, ఇన్‌కం టాక్స్ లతో రావొచ్చు. ఎవరికోసం ఎదురుచూసేది లేదు, ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతం. పార్టీ క్యాడర్‌కు నాయకత్వం అండగా నిలబడుతుంది” అని అన్నారు.
మునుగోడుకు కాంగ్రెస్ ప్రచార కమిటీ
హైదరాబాద్ : మునుగోడు నియోజక వర్గ ఎన్నికల వ్యూహం, ప్రచారం కోసం ప్రత్యేక కమిటీని ఏఐసీసీ నియమించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కన్వీనర్‌గా పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సభ్యులుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, ఈరవత్రి అనిల్కుమార్లను నియమించింది.
ఇంతకు మించిన ద్రోహం ఇంకొకటి లేదు: భట్టి
నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాలపై ఈడీ సోదాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి మించిన ద్రోహం ఇంకొకటి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. ఆయన ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పారు. ఈ క్షణం నుంచి అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5న అక్కడ పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్న సమయంలో రాహుల్, సోనియాకు అండగా ఉండాల్సిన నేత.. రాజీనామా చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని భట్టి తెలిపారు.