సమాధానం ఇవ్వలేకే కేటీఆర్ మొహం చాటేశారు: రేవంత్

సమాధానం ఇవ్వలేకే కేటీఆర్ మొహం చాటేశారు: రేవంత్

ఔటర్ రింగ్ రోడ్డు  వివాదంపై మంత్రి   కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ఈ వివాదంపై ఇప్పటి వరకు సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సమాధానం ఇవ్వలేకే కేటీఆర్ మొహం చాటేశారని..  అందుకే  అధికారితో వివరణ ఇప్పించారని అన్నారు.  ఓఆర్ఆర్ పై అర్వింద్ వివరణ సంతృప్తికరంగా లేదని.. రింగ్ రోడ్డు లీజ్ వెనుక  వేల కోట్ల దోపిడి జరిగిందన్నారు రేవంత్.  ఔటర్ రింగ్ రోడ్డుపై  రూపాయి కూడా రుణభారం లేదన్నారు.  ఓఆర్ఆర్ వివాదంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని.. అవసరమైతే  కోర్టుకు వెళ్తామన్నారు రేవంత్.

కేంద్రం ఎలాగైతే ప్రభుత్వ సంస్థల్ని  అమ్ముతుందో తెలంగాణ సర్కార్ అలాగే చేస్తోందన్నారు రేవంత్. విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయొద్దన్న కేసీఆర్ ఓఆర్ఆర్ ను ఎందుకు ప్రైవేట్ కు ఇచ్చారని ప్రశ్నించారు.   ప్రజల ఆస్తి అయిన ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ కు ఎందుకు  అప్పగించారో చెప్పాలన్నారు. 6 వేల ఎకరాల్లో ఉన్న ఓఆర్ఆర్ భూమి విలువ 65 వేల కోట్లని తెలిపారు. 

2031 తర్వాత హెచ్ఎమ్ డీఏ ప్లాన్ మారుతుందని రేవంత్ చెప్పారు.   ఓఆర్ఆర్ పై నివేదిక ఇచ్చిన సంస్థ బ్యాగ్ గ్రౌండ్  బాగోలేదన్నారు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా ఎవరైనా టెండర్లను పిలుస్తారా? అని ప్రశ్నించారు.  ప్రస్తుతం టోల్ గేట్స్ పై ఏడాదికి 730 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.