
- మంత్రి వ్యాఖ్యల గురించి సిట్‌కు చెప్పిన: రేవంత్
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తనకు, బండి సంజయ్‌కు నోటీసులిచ్చిన సిట్.. దానిపై మాట్లాడిన కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇయ్యలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమను భయపెట్టేందుకే సర్కారు సిట్ ద్వారా నోటీసులిచ్చిందని ఆరోపించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, ఆయన్ను విచారిస్తే అసలు నేరస్తులెవరో బయటికొస్తారని చెప్పానన్నారు. పేపర్ లీక్‌పై చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలంటూ నోటీసులు అందడంతో.. గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సిట్ ఆఫీసులో రేవంత్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సిట్ దర్యాప్తు పూర్తికాకముందే నేరం ఎలా జరిగిందో కేటీఆర్ ప్రజలకు బహిర్గతం చేశారని.. ఇంత చేసినా కేటీఆర్ వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు అనడంలో అంతర్యం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్‌పై ఫిర్యాదును తీసుకోబోమని, కేవలం సమాచారమే తీసుకుంటామని సిట్ అధికారులు తనతో చెప్పారన్నారు. కేటీఆర్‌తో పాటు టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ లను విచారించాలని కోరానని పేర్కొన్నారు. వంద మందికి పైగా అభ్యర్థులకు 100 మార్కులు వచ్చాయని తాము చెప్తే.. వాళ్లను విచారించాల్సిందిపోయి రివర్స్‌లో తమకు నోటీసులిచ్చి సర్కారు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. అయినా సరే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తమ వద్ద ఉన్న సమాచారం సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌కు అందజేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, అర్హత సాధించిన వారు.. ఉద్యోగాలు పొందినోళ్ల వివరాలను వెబ్సైట్లో పెట్టాల్సిందిగా అధికారులను కోరానన్నారు.
ఇయ్యాల, రేపు ఓయూ, కేయూల్లో నిరసన తెలుపుతం
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దే అని రేవంత్ రెడ్డి అన్నారు. నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి.. పెద్ద తలకాయల్ని కేటీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పునరావాసానికి టీఎస్ పీఎస్సీ కేంద్రంగా మారిందని మండిపడ్డారు. లీక్ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి కీలక భాగస్వామ్యం ఉందన్నారు. పేపర్లు లీక్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం బీఆర్ఎస్ పార్టీ విస్తరణపైనే దృష్టి పెట్టిందని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు టీఎస్ పీఎస్సీ పై విశ్వాసం కల్పించడంతో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందన్నారు. హిందువులకు గుడి, ముస్లింలకు మసీదు, సిక్కులకు గురుద్వారా ఎలాగో.. నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ అలాంటిదేనన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
శుక్ర, శనివారాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష ఉంటుందని, శనివారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలోనూ నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్ వెల్లడించారు. 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్‌ను ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని రేవంత్ కామెంట్ చేశారు. ఇంత పెద్ద టీఎస్ పీఎస్సీ వ్యవస్థలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాకు సరిపోయే తెలంగాణ బిడ్డ ఒక్కరూ లేరా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ ఏపీలోని రాజమండ్రికి చెందిన వ్యక్తి అన్నారు. పేపర్ లీక్‌పై విచారణ చేసేందుకూ తెలంగాణకు చెందిన అధికారిని నియమించలేదని రేవంత్ విమర్శించారు. నిజాయతీ కలిగిన అధికారులు ఎంతో మంది ఉన్నా విజయవాడకు చెందిన ఏఆర్ శ్రీనివాస్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారన్నారు.
సిట్ఆఫీసు ముందు ఉద్రిక్తత
సిట్ ఆఫీసుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ వద్ద రేవంత్ వాహనం మినహా మిగతా వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. వాటిని అనుమతించాల్సిందేనని రేవంత్ వారించడంతో పంపించారు. తర్వాత లిబర్టీ చౌరస్తా వద్దకు చేరుకోగానే రేవంత్ వాహనం తప్ప వేరే వాహనాలు వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. వాహనాలను అనుమతించకపోవడంతో ఆయన కారు దిగి పార్టీ శ్రేణులతో కలిసి నడుచుకుంటూ సిట్ ఆఫీసుకు వెళ్లారు. సిట్ ఆఫీసు వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సిట్ ఆఫీసు ముందు కాంగ్రెస్క్యాడర్ నిరసనకు దిగింది. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ సహా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా, కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మల్లు రవి, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, సునీతా రావు తదితర సీనియర్ నేతలను పోలీసులు ఇళ్లలోనే నిర్బంధించారు.