ఇది దశాబ్ది దగా.. కేసీఆర్​ ఇచ్చిన పది హామీలను నెరవేర్చలే: రేవంత్​ రెడ్డి

ఇది దశాబ్ది దగా.. కేసీఆర్​ ఇచ్చిన పది హామీలను నెరవేర్చలే: రేవంత్​ రెడ్డి
  • ఆయన రావణాసురుడిలాంటోడే 
  • పది హామీలను పది తలలుగా పెట్టి కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేస్తం
  • దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున 
  • అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు
  • యంత్రాంగం బీఆర్​ఎస్​ కార్యక్రమాల్లో మునిగిపోయిందని విమర్శ

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది దశాబ్ది ఉత్సవాలు కాదని.. దశాబ్ది దగా అని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్​ పార్టీ, కేసీఆర్​ ఇచ్చిన ముఖ్యమైన పది హామీలను అమలు చేయలేదన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్​మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్​ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పోడు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనారిటీలు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. వాటిని ప్రజలకు వివరించేందుకు ‘దశాబ్ది దగా’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఉత్సవాల ముగింపు రోజైన ఈ నెల​22న అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపడతామన్నారు. కేసీఆర్.. రావణాసురుడిలాంటోడేనని, పది హామీల వైఫల్యాలను పది తలలుగా కేసీఆర్​ దిష్టి బొమ్మకు తగిలించి.. ఊరేగింపుగా తీసుకెళ్లి.. ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. శనివారం గాంధీ భవన్​లో పార్టీ పొలిటికల్​అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్​అనంతరం రేవంత్​ మీడియాతో మాట్లాడారు. 

పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ

పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చించామని రేవంత్​ చెప్పారు. రాజకీయ కార్యకలాపాలు పీఏసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు.  పీఏసీ కన్వీనర్​గా షబ్బీర్​ అలీని నియమించామని చెప్పారు. పది రోజుల్లో పార్టీ మండల  కమిటీలను నియమిస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ యంత్రాంగాన్ని కేసీఆర్​తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. డెత్​సర్టిఫికెట్​తీసుకుందామన్నా ఆఫీసర్లు అందుబాటులో ఉండడం లేదని, బీఆర్​ఎస్​  సేవలో మునిగి తేలుతున్నారని ఫైర్​అయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, నేతలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, జీవన్​ రెడ్డి, షబ్బీర్​ అలీ, జగ్గారెడ్డి, బలరాం నాయక్​, ​అంజన్​కుమార్ ​యాదవ్​, రేణుకా చౌదరి, సంపత్​ కుమార్​, చిన్నారెడ్డి  పాల్గొన్నారు. 

కవులు, కళాకారులను అవమానిస్తరా!

బి.నర్సింగరావు సామాజిక స్పృహ ఉన్న డైరెక్టర్​అని, ప్రజా సమస్యలను వివరిస్తూ మా భూమి అనే సినిమా తీశారని రేవంత్ ​గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ పెద్దలు అపాయింట్​మెంట్​ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్​కు లేదన్నారు. కేటీఆర్ తన వ్యవహార శైలి మార్చుకొని ​నర్సింగరావును కలవాలని ​సూచించారు. 

అమరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్​

 కేసీఆర్ ​చేసిన మోసాలకు అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని రేవంత్​ మండిపడ్డారు. వారి త్యాగాలను గుర్తించడం లేదన్నారు. వారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్​బెడ్రూం ఇండ్లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్​కు ఉద్యమకారులన్నా, అమరవీరులన్నా అసూయ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్​ను కొనసాగిస్తామని చెప్పలేకనే...

కేసీఆర్​నే సీఎంగా కొనసాగిస్తామని చెప్పలేకనే.. ఆయన పథకాలను కొనసాగిస్తామని బండి సంజయ్​ చెప్పారని రేవంత్​ ఎద్దేవా చేశారు. మోదీ పాలన ఉండాలంటూ కేసీఆర్​ అభినందిస్తే.. కేసీఆర్​ అద్భుత పాలన చేస్తున్నారంటూ సంజయ్​ అంటున్నారని విమర్శించారు. రెండో రాజధాని ప్రతిపాదనపై చర్చకు వస్తే.. పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికలపై అధిష్టానంతో చర్చించి ప్రకటన చేస్తామన్నారు. 

పలువురు కాంగ్రెస్​ నేతలకు కీలక బాధ్యతలు

పలువురు నేతలకు కాంగ్రెస్​ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ను సేవా దళ్, ఐఎన్​టీయూసీ ఇన్​చార్జిగా రేవంత్​ నియమించారు. గీతా రెడ్డికి మహిళా కాంగ్రెస్​ ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ వినోద్​ రెడ్డిని యూత్​ కాంగ్రెస్​, ఎన్​ఎస్​యూఐ, పీసీసీ ఎన్నారై కో ఆర్డినేటర్​ మద్దుల గాల్​రెడ్డిని ఎన్నారై ప్రోగ్రామ్స్​ అండ్​ ఇండియన్​ ఓవర్సీస్​ కార్యక్రమాలకు ఇన్​చార్జ్​గా నియమిస్తూ శనివారం ఆదేశాలిచ్చారు.