- కేసీఆర్.. సభకు రా లేదంటే రాజీనామా చెయ్..
- ఎవడబ్బ సొమ్మని తింటూ ఫాంహౌస్‌ల పన్నవ్
- శాసనసభకు రాని నిన్ను డిస్మిస్ చేయాల్సిందే
- ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వస్త.. జెండా ఎగరేస్త
- వచ్చే నెల సిద్దిపేటకు వస్త.. దండయాత్ర చేస్త
- వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో మళ్లీ గెలుస్తున్నం
- నేను ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ను మొలకెత్తనియ్య
- లక్ష కోట్లలో వాటా ఇయ్యాల్సి వస్తదని చెల్లెను ఎల్లగొట్టిండు
- కేటీఆర్.. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రావడం తెలివా..?
- సభలో నా తెలివేందో.. నీ సదువేందో తేల్చుకుందాం
- కేసీఆర్, కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
‘‘అయ్యాకొడుకులు ఇద్దరూ అసెంబ్లీకి వస్తే పదేండ్ల మీ పాలన, వెయ్యి రోజుల మా పాలనపై అక్కడే తేల్చుకుందాం’’ అని కేసీఆర్, కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పులకు అసలు, మిత్తి కట్టుకుంట.. మీరు పెట్టిన పాత స్కీమ్‌లను అమలు చేస్తూనే కొత్త పథకాలను కొనసాగిస్తున్నం. కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అద్భుతంగా జరుగుతుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు.. ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఊరూరా తప్పుడు ప్రచారం చేస్తున్నరు” అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్తన పదేండ్ల పాలనలో లక్ష కోట్లు దోచుకుంటే అందులో చెల్లెలు కవితకు వాటా ఇయ్యాల్సి వస్తదని కేటీఆర్ ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని అన్నారు. పుట్టెడు దుఖంతో జైలు నుంచి వచ్చిన సొంత చెల్లెకి అన్నం పెట్టనోడు కోటి మంది మహిళలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. శనివారం నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కేసీఆర్, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ‘‘నాకు సదువు రాదని ఇయ్యాల కేటీఆర్ ఎక్కడో అన్నడు.. నాకు చదువు వస్తదో రాదోగానీ సంస్కారం మాత్రం ఉంది.. అందుకే మిమ్మల్ని చింతబరిగెలతో కొట్టకుండా వదిలేశా” అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఫ్యూచర్లేదని, ఆ పార్టీదంతా గతమేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్‌కు భయపడే కేసీఆర్ఫాంహౌజ్లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే 117, పెరగకపోతే 90 సీట్లలో గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బావ బామ్మర్దులు (హరీశ్‌రావు, కేటీఆర్) పోటీ చేసే సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా ఈ సారి మూడు రంగుల జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు.
ఈ నెలాఖరున సిరిసిల్లకు వచ్చి కేటీఆర్ సంగతేందో చూస్తానని, వచ్చే నెల సిద్దిపేటకు వచ్చి దండయాత్ర చేస్తానని అన్నారు. పెద్దలు జానారెడ్డి లాంటి లీడర్లు ఎందుకులే అని మిమ్మల్ని వదిలిపెట్టారని.. తాను మాత్రం అలాంటివాడిని కాదని పేర్కొన్నారు. సిరిసిల్ల, సిద్దిపేటకు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకెళ్లి బహిరంగ సభలు పెట్టడానికి ఏర్పాట్లు చేయాలని పీసీసీ ప్రెసిడెంట్‌ను కోరారు. ‘కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా.. మీ సంగతేందో తేల్చనిదే నేను నిద్రపోను.. ఇదే నా సవాల్.. సిద్ధగా ఉండండి’ అని హెచ్చరించారు.
కేసీఆర్.. అసెంబ్లీకి రా.. లేదంటే రాజీనామా చెయ్
‘‘కేసీఆర్.. శాసనసభకు రా, లేదంటే గౌరవంగా పదవికి రాజీనామా చెయ్.. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం’’ అని సీఎం రేవంత్సవాల్విసిరారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల సొమ్మును తింటూ ఫాంహౌస్‌లో పడుకుంటున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 365 రోజులు డ్యూటీకి రాని ఉద్యోగులను బర్తరఫ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 30 నెలల్లో ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాకుండా కోట్ల రూపాయల జీతభత్యాలు తీసుకున్న కేసీఆర్‌ను ఏం చేయాలని అడిగారు.
‘‘కేసీఆర్తీసుకున్న జీతం పేద ప్రజలు కట్టిన పన్నులు కాదా? అలాంటప్పుడు కేసీఆర్‌ను పదవి నుంచి డిస్మిస్ చేయాలా ? వద్దా ?’ ’ అని ప్రశ్నించారు. కేసీఆర్సీఎం అయితే రావులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యారన్నారు. అదే తాను సీఎం అయితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పదవులు దక్కాయని చెప్పారు. కేసీఆర్ఓఆర్ఆర్ను అమ్ముకొని రూ.7 వేల కోట్లకు పైగా డబ్బులు మింగి కుర్చీ నుంచి దిగిపోయారని విమర్శించారు.
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని రైతుబంధు వేయలేదన్నారు. ‘‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే వాళ్ల కుటుంబసభ్యులకు పేపర్, టీవీ, ఫామ్ హౌస్, దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాడు. అందుకే కాకుల్లా రాష్ట్రం మీద పడి మాట్లాడుతున్నరు” అని ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో బీఆర్ఎస్లీడర్లకు సైతం సన్న బియ్యం, రైతు భరోసా, ఫ్రీ కరెంట్, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు.
ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.9.85 కోట్ల వ్యయంతో నిర్మించే తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి, నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు, మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్లతో ఏర్పాటుచేసే పవర్ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్ల పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే, నకిరేకల్ మండలంలో రూ.20 కోట్లతో నిర్మించే సమీకృత మండల స్థాయి కార్యాలయాల భవన నిర్మాణానికి, రూ.45.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు.
అభివృద్ధిపై ప్రజల్లో చర్చ పెడదాం
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన, 30 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెడదామని సీఎం రేవంత్అన్నారు. వరి వేస్తే ఉరే అని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబితే.. తమ ప్రభుత్వం మాత్రం రైతుల ఖాతాల్లో రూ.90 కోట్లు వేసిందని తెలిపారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కింద 30 నెలల్లో రూ.36 వేల కోట్లు వేశామని, ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని, 70 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 70 వేలకు పైగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం దేశంలోనే ఇదే మొదటిసారన్నారు. చేతనైతే తండ్రి, కొడుకు, అల్లుడు అసెంబ్లీకి వస్తే లెక్కలు తేల్చుదామని, సిద్దిపేట, సిరిసిల్ల గడ్డపైన చర్చకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
చెల్లెని వెళ్లగొడితే తండ్రి మందలించొద్దా?
కొడుకు గంజాయి తాగి చెల్లెను వెళ్లగొడితే తండ్రి మందలించొద్దా ? నాలుగు ఇంగ్లిష్ ముక్కలు వస్తే తెలివి అనుకుంటున్నవా.. సభకు రా.. నా తెలివేందో.. నీ సదువేందో తేల్చుకుందాం. నాకు సంస్కారం ఉంది కాబట్టే రాఖీ పండుగకు సీతక్క, సురేఖ ఇంటికొస్తే నవ్వుకుంటూ ఆహ్వానం పలికి రాఖీ కట్టించుకున్నా. తోడబుట్టిన నీ సొంత చెల్లెలిని పండుగ పూట ఇంటికి రాకుండా నువ్వు గెంటేశావు. ఆడ బిడ్డలకు ఇచ్చే గౌరవం ఇదేనా? చెల్లెలు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్ కోటి మంది ఆడబిడ్డల బాగోగులు చూస్తాడట.
- సీఎం రేవంత్ రెడ్డి
