రూపాయి పతనంపై చర్చ : హిందీపై రేవంత్​, నిర్మల మధ్య వాగ్వాదం

రూపాయి పతనంపై చర్చ : హిందీపై రేవంత్​, నిర్మల మధ్య వాగ్వాదం

లోక్​ సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తాను మాట్లాడిన హిందీ భాషను ఉద్దేశించి నిర్మల చేసిన కామెంట్స్ పై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘‘నేను శూద్రుడిని, నాకు స్వచ్ఛమైన హిందీ రాదు.. నిర్మలగారు బ్రాహ్మణవాది, మంచి హిందీ మాట్లాడుతారు”అని రేవంత్​ వ్యాఖ్యానించారు. కులం, మతానికి సంబంధించిన వ్యాఖ్యలు ఎవరూ సభలో చేయకూడదని స్పీకర్  ఓం బిర్లా తెలిపారు. డాలరుతో రూపాయి మారకం విలువ పతనంపై కొశ్చన్ అవర్లో రేవంత్ మాట్లాడారు.

‘‘మోడీ గుజరాత్  సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ఐసీయూలో ఉందంటూ పోల్చారు”అని రేవంత్​ గుర్తు చేశారు. దీనిపై జోక్యం చేసుకున్న స్పీకర్ ... డైరెక్ట్ గా ప్రశ్న అడగాలని సూచించారు. అయితే తనకు మధ్యలో అంతరాయం కలిగించొద్దని స్పీకర్​ తో  రేవంత్​ అన్నారు. ఇలా అనడంపై స్పీకర్  అభ్యంతరం చెప్పారు.  స్పీకర్​ పట్ల అలా ప్రవర్తించకూడదని సభ్యులకు చెప్పాలని లోక్​ సభలో ప్రతిపక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరికి స్పీకర్​ సూచించారు. అనంతరం రేవంత్​ తన ప్రశ్నను పూర్తి చేశారు.

రేవంత్ ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బదులిస్తూ.. కాంగ్రెస్  ఎంపీ వీక్  హిందీలో అడిగిన ప్రశ్నకు వీక్  హిందీలోనే ఆన్సర్ చెబుతానంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంటే... ఇప్పుడు మాత్రం పరుగులు పెడుతోందని నిర్మల చెప్పారు.  ‘‘కాంగ్రెస్​ సభ్యుడు..  మోడీ అలనాటి వ్యాఖ్యలను ప్రస్తావించే ముందు, నాటి ఆర్థిక సూచీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఐసీయూలోనే ఉంది. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. ఇందుకు గర్వించాల్సింది పోయి అసూయ పడుతున్నారు” అని వివరించారు.