
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తిరస్కరణ మొదలైందని, లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని లేఖలో తెలిపారు.
ఓడారన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ముఖ్య నేతలు కుంటి సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాకుండా ఐదేళ్ల క్రితం ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయని, సొంతగడ్డలైన సిద్ధిపేట్, సిరిసిల్లలోనే దారుణంగా ఓటు శాతం పడిపోయిందని రేవంత్ అన్నారు.
కరీంనగర్, నిజామాబాద్ లలో మీ కుటుంబసభ్యులే ఓడిపోయారని అన్నారు. టీఆర్ఎస్ పతనానికి ఇదే సంకేతమని అన్నారు. మల్కాజ్ గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారని అన్నారు. అవమానించేలా మాట్లాడడం మీ అహంకారానికి నిదర్శనమని రేవంత్ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ లేఖలో అన్నారు.