
- ఈ 8 నెలలూ కీలకం.. విరామం లేకుండా పనిచేయాలె
- కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు
- పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, సోషల్ మీడియా టీంలతో ఠాక్రేతో కలిసి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలంతా వచ్చే 8 నెలల పాటు విరామం లేకుండా పనిచేయాలని, ఇదే పార్టీకి కీలక సమయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మీడియాలో తమ వాదనలను బలంగా వినిపించాలని, అందుకోసం ప్రతి నాయకుడూ సిద్ధంగా ఉండాలన్నారు. శనివారం గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా టీంలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఇన్చార్జి జనరల్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 84 మంది జనరల్ సెక్రటరీలు ఉండగా.. ఇప్పటికే 64 మందికి బాధ్యతలిచ్చారు.
తాజాగా మిగతా 20 మందికీ బాధ్యతలను అప్పగించారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలను వాళ్లు సక్రమంగా నిర్వర్తించాలని రేవంత్ స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య బంధాన్ని ఎండగట్టాలని, ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సమావేశాల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీలు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్, స్టేట్ కోఆర్డినేటర్ పెట్టెం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో కర్నాటక ఎన్నికల్లో ప్రచారంపైనా చర్చించామని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని కొద్ది రోజుల కిందట రేవంత్ కూడా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎవరెవరు ప్రచారానికి వెళ్లాలనే దానిపై చర్చ జరిగిందని చెప్తున్నారు. మరోవైపు సోమవారం నుంచి రేవంత్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. 25వ తేదీ వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా, బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ తరఫున రాష్ట్రానికి (ఉమ్మడి ఏపీ) సీఎంలుగా పనిచేసిన సీనియర్ నేతల ఫొటోలను గాంధీభవన్‌లోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో కూడా ఉంది. బీజేపీలో చేరినందున గాంధీభవన్ లో ఉన్న ఆయన ఫొటోను తీసేయాలంటూ పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేసినట్టు సమాచారం.