చెన్నై: తమిళనాడులో మంగళవారం నుంచి నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు వెల్లడించారు. ఇప్పటికే తమపై అధిక పని భారం, మ్యాన్‌పవర్ తక్కువగా ఉండటం, డెడ్‌లైన్ ఒత్తిడి, అవసరమైన ట్రైనింగ్ ఇవ్వలేదని రెవెన్యూ ఉద్యోగాల అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచి సర్‌కు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా అధికారులకు అవసరమైన శిక్షణ, బూత్ లెవల్ ఆఫీసుల్లో అదనపు సిబ్బంది నియామకం, బీఎల్‌వో స్థాయిలో తగినంత సిబ్బందిని నియమించాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సర్‌ను ప్రణాళిక లేకుండా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ సిబ్బందితో పాటు అంగన్వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది, టీచర్లు, బీఎల్‌వోలుగా నియమించిన అన్ని శాఖల సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటాయని వెల్లడించారు.
తహసీల్దార్లు, గ్రామ పరిపాలనా అధికారులు, గ్రామ సహాయకులు, సర్వేయర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు కూడా పాల్గొంటారని చెప్పారు. సర్ బహిష్కరణను బీజేపీ నేత తమిళిసై ఖండించారు. డీఎంకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సర్ ను అడ్డుకుంటోందని, ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
