
- నేడు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం
- వీఆర్వో, వీఆర్‌ఏల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దుకు, తహసీల్దార్ల అధికారాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సర్వీస్ రూల్స్, ప్రమోషన్లతోపాటు తమ భవిత్యమేమిటో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. తమ ఉద్యోగాలకే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఇన్నాళ్లు వేర్వేరుగా ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చాయి. అక్టోబర్ 2లోపు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయా సంఘాల నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘రెవెన్యూ శాఖను కాపాడండి.. ఇతర శాఖల్లో విలీనాన్ని ఆపండి’ అనే నినాదంతో ఈ నెల 29న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 4 వేల మందితో సభ నిర్వహిస్తామని వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నేతలు చెప్పారు. ఈ సభకు ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, నర్సిరెడ్డి, రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, న్యాయవాది రచనారెడ్డితోపాటు ట్రెసా, టీజీటీఏ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎంప్లాయిస్ యూనియన్, జాక్టో, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులను ఆహ్వానిస్తామన్నారు. ఆ సభలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సోమవారం రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిసి తమ ఉద్యోగ భద్రత గురించి వినతిపత్రం సమర్పిస్తామని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌రావు తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, గౌరవ అధ్యక్షుడు విజయరామారావు, తెలంగాణ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వీఆర్‌ఏల సంఘం నేతలు సుదర్శన్, వంగూరి రాములు, ఇంజమూరి ఈశ్వర్, ఉమామహేశ్వర్, రాములు, నాగేశ్వర్, కృష్ణ, వెంకటేశ్, గోవర్దనాచారి, లక్ష్మీనర్సింహ పాల్గొన్నారు.