పేదలకు అన్యాయం జరగనియ్యం : మంత్రి పొంగులేటి

పేదలకు అన్యాయం జరగనియ్యం : మంత్రి పొంగులేటి
  •     రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
  •     వెలుగుమట్ల భూదాన్​ భూముల బాధితులతో సమావేశం

ఖమ్మం, వెలుగు: వెలుగుమట్ల భూదాన్​భూముల్లోంచి తరలించినవారిలో అర్హులను గుర్తించి, ఈనెల 15లోగా ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం సర్వే కొనసాగుతోందని, అర్హుల సంఖ్య తేలగానే స్థలాలిస్తామన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ లో కలెక్టర్​ అనుదీప్, సీపీ సునీల్ దత్ తో కలిసి వెలుగుమట్ల బాధితులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భూదాన్​భూములకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

ఎవరికైనా డబ్బులిస్తే నిర్భయంగా పోలీస్ అధికారులకు చెప్పాలని, మోసగాళ్ల నుంచి డబ్బు రికవరీ చేసి బాధితులకు అందించేలా చూస్తామన్నారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. పట్టాలు లేవని తెలియక కొంతమంది బాధితులు అక్కడ ఇండ్లు కట్టుకున్నారని అన్నారు. బాధితులకు ఇచ్చే ఇండ్ల దగ్గర అంగన్వాడీ కేంద్రం, స్కూల్, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. 

పదేండ్లలో కండ్లు మూసుకున్నరా..? 

డబ్బులిచ్చి భూదాన్​భూముల్లో ఇండ్లు కట్టుకున్నామని పేదలు చెప్పారని, పదేండ్లు పాలించిన బీఆర్ఎస్​లీడర్లు కళ్లు మూసుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. 2023లో బీఆర్ఎస్​హయాంలో భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చారని, అప్పుడు ఎందుకు పట్టాలివ్వలేదో చెప్పాలన్నారు. వాళ్లు పట్టాలివ్వకపోవడం కారణంగానే ఇప్పుడు కూల్చివేతలు జరిగాయన్నారు. 

ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ కనీసం రూ.30 వేల నుంచి రూ.ఐదారు లక్షల వరకు డబ్బులిచ్చి స్థలం కొనుక్కున్నవారేనని అన్నారు. ఇండ్ల కూల్చివేతకు కొన్ని గంటలకు ముందు కూడా కొందరు రూ.7 నుంచి 8 లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.