శేరిలింగంపల్లి మా అడ్డా.. అడ్డం ఎవరొస్తారో చూస్తం.. సర్కిల్లో రెవెన్యూ ఆఫీసర్ల తిష్ట

శేరిలింగంపల్లి మా అడ్డా.. అడ్డం ఎవరొస్తారో చూస్తం..  సర్కిల్లో రెవెన్యూ ఆఫీసర్ల తిష్ట
  • ఎక్కువ ఆదాయం వచ్చే ఏరియాల కోసం బేరసారాలు 
  • అమ్దాని వచ్చే డాకెట్​ను బట్టి ఎమౌంట్​ ఫిక్స్​ 
  • అంతా తామై చక్కబెడుతున్న ఇద్దరు ఆఫీసర్లు  
  •  రెండు రోజుల్లో అనుకున్నవాళ్లకు పోస్టింగ్​లు 
  • పది, పదిహేనేండ్ల నుంచి పాతుకుపోయిన స్టాఫ్​

గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి సర్కిల్​లో రెవెన్యూ ఆఫీసర్లు ఎక్కువ ఆదాయం వచ్చే ఏరియాలను పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సదరు ఏరియాలను కట్టబెడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు కింది స్థాయి అధికారులు అంతా తామై ఓ ఉన్నతాధికారి వద్ద పనులు చక్కచెడుతున్నట్లు సమాచారం. 

రూల్​ప్రకారం.. ఒక ఉద్యోగి ఎక్కడా మూడేండ్లకు మించి ఉండకూడదన్న రూల్​ఉంది. ఈ నిబంధనకు ఇక్కడ పాతరేశారు. ఒక్కో ఉద్యోగి నాలుగేండ్ల  నుంచి మొదలుకుంటే 15 ఏండ్ల వరకు కూడా పని చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రెవెన్యూలో ట్యాక్స్​ఇన్​స్పెక్టర్లు, బిల్​కలెక్టర్ల ఏరియాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన వారు అనుకున్న విధంగా డబ్బులు ముట్టజెప్పిన వారికి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.  

లక్షల్లో సమర్పించుకున్నరట

గ్రేటర్ లో 30 సర్కిల్స్ ఉండగా.. శేరిలింగంపల్లి నుంచి ఎక్కువ కలెక్షన్ వస్తూ ఉంటుంది. ఇక్కడే అనేక ఐటీ కంపెనీలు, గేటెడ్​కమ్యూనిటీలు, విల్లాలు, భారీ కమర్షియల్​కాంప్లెక్సులున్నాయి. వీటితో పాటు పర్మిషన్లు లేని అక్రమ నిర్మాణాలు, హాస్టల్​బిల్డింగులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏరియానే టార్గెట్​చేసిన రెవెన్యూ ఆఫీసర్లు పోస్టింగుల కోసం లక్షల్లో సమర్పించుకుంటున్నట్టు సమాచారం.  

అమ్దాని వచ్చే ఏరియాలను బట్టి..

శేరిలింగంపల్లి సర్కిల్​వ్యాప్తంగా తొమ్మిది డాకెట్లు(ప్రాంతాలు) ఉన్నాయి. ఒక్కో డాకెట్​కు ఒక బిల్​ కలెక్టర్​, ఒక ట్యాక్స్​ఇన్​స్పెక్టర్​ఉంటారు. తొమ్మిది డాకెట్లలో శేరిలింగంపల్లి, తారానగర్​డాకెట్ తప్ప మిగిలిన అన్నీ ఏరియాల్లో ట్యాక్స్​వసూళ్లు ఎక్కువగానే ఉంటాయి. డాకెట్ నంబర్​1,104 తప్ప మిగిలిన అన్నీ ఏరియాల్లో ట్యాక్స్​కలెక్షన్లు భారీగానే వస్తుంటాయి. 

దీంతో సర్కిల్​రెవెన్యూ ఉన్నతాధికారులు వసూళ్లు ఎక్కువగా వచ్చే ఏరియాలకు ఒక రేటు, తక్కువ వచ్చే ఏరియాలకు ఒక రేటు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆశావహులైన ట్యాక్స్​ఇన్​స్పెక్టర్లు, బిల్​ కలెక్టర్లు వసూళ్లు ఎక్కువగా ఉండే డాకెట్ల కోసం భారీగా డబ్బులు ముట్టజెప్పి డాకెట్లను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రెవెన్యూ విభాగంలోని ఇద్దరు కింది స్థాయి అధికారులు ఓ ఉన్నతాధికారి వద్ద చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.   

ఏండ్ల తరబడి ఒకే సర్కిల్​లో  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆఫీసర్లు, సిబ్బంది ఒకే ఆఫీస్​లో మూడేండ్ల మించి పని చేయకూడదు. తర్వాత తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, శేరిలింగంపల్లి సర్కిల్​రెవెన్యూ విభాగంలో అధికారులు, సిబ్బంది పదేండ్లుగా కుర్చీలను పట్టుకొని వేలాడుతున్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూలో పనిచేస్తున్న ట్యాక్స్​ఇన్​స్పెక్టర్లు, బిల్​ కలెక్టర్లు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని తమ పోస్టులను కాపాడుకుంటూ వస్తున్నారు. 

ఈ విషయం ముఖ్య అధికారుల నోటీసులో కూడా ఉంది. ప్రస్తుతం ఈ సర్కిల్​లో టాక్స్ ఇన్​స్పెక్టర్​ఏ.కృష్ణ ఐదేండ్లుగా ఇక్కడే ఉన్నారు. టీఐలు జ్ఞానేశ్వర్, రాజేశ్వర్, వెంకటేశం, సత్యనారాయణరెడ్డి, ఆనంద్ కుమార్ 15 ఏండ్లుగా శేరిలింగంపల్లి జోన్​లోనే పాతుకుపోయారు. ఇక బిల్ కలెక్టర్లు అశోక్ యాదవ్, స్వరూప్, రమేశ్, విద్యాసాగర్, వెంకటేశ్ పదేండ్లకు పైగా సర్కిల్​నుంచి బయటకే వెళ్లలేదు. మరో నలుగురు బిల్​కలెక్టర్లు వినోద్, శ్రీదత్త శ్రీనివాస్, సాయి తేజ, కృష్ణ మూడేండ్లకుపైగా ఇదే సర్కిల్‌‌‌‌లో కొనసాగుతున్నారు.