V6 News

హైదరాబాద్‌‌‌‌ అందాలకు.. అడవి బిడ్డలు ఫిదా !  

హైదరాబాద్‌‌‌‌ అందాలకు.. అడవి బిడ్డలు ఫిదా !  
  • పర్యాటక రంగంలో ‘రివర్స్ టూరిజం’కు సర్కారు శ్రీకారం
  • ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా నుంచి హైదరాబాద్‌‌‌‌ సందర్శనకు వచ్చిన ఆదివాసీలు
  • ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి జూపల్లి
  • తారామతి బారాదరిలో ఘన స్వాగతం
  • రెండు రోజుల పాటు సిటీలోని ఐకానిక్‌‌‌‌ ప్లేసెస్ సందర్శన

హైదరాబాద్/ఆదిలాబాద్‌‌‌‌, వెలుగు : పర్యాటక రంగ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఎప్పుడూ నగరవాసులే ప్రకృతి కోసం పల్లెలకు, అడవులకు వెళ్లడం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా ‘అడవి బిడ్డలే నగరాన్ని చూడాలి.. ఆధునిక అభివృద్ధిని కళ్లారా వీక్షించాలి’ అనే సంకల్పంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ‘రివర్స్ టూరిజం’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌‌‌‌పోజర్‌‌‌‌ ప్రోగ్రాం’ను బుధవారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడెంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించారు. వారితో ముచ్చటిస్తూ.. నగర విశేషాలను, పర్యటన ఉద్దేశాన్ని వివరించారు. ఈ పర్యటనలో భాగంగా 250 మంది ఆదివాసీలు ఐదు ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నారు.

తారామతి బారాదరిలో ఘన స్వాగతం

హైదరాబాద్‌‌‌‌ నగరానికి చేరుకున్న ఆదివాసీ బృందానికి తారామతి బారాదరిలో మంత్రి జూపల్లితో పాటు టూరిజం కార్పొరేషన్‌‌‌‌ ఎండీ గౌతమి, డైరెక్టర్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ రంజిత్‌‌‌‌ నాయక్‌‌‌‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆదివాసీలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో అనుసంధానం కావడంతో ఆదివాసీ, గిరిజన యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. నగరాల్లోని అభివృద్ధిని చూసి వారు చదువుల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. 

ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అయినప్పుడే ఆదివాసీల జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తాయన్నారు. ఆదివాసీ సంస్కృతికి, నగర నాగరికతకు మధ్య ఈ ప్రోగ్రాం ఒక వారధిలా నిలుస్తుందని చెప్పారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆలోచనల మేరకు పర్యాటక రంగంలో వినూత్న మార్పులు తెస్తున్నామన్నారు. వారి వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌‌‌‌ మహాజన్‌‌‌‌, ఐటీడీఏ పీఓ యువరాజ్‌‌‌‌ మర్మాట్‌‌‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ కామ్డే, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌‌‌‌ జాదవ్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్‌‌‌‌ పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు నగరంలోనే...

హైదరాబాద్‌‌‌‌ సందర్శనకు వచ్చిన ఆదివాసీలు రెండు రోజుల పాటు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా చార్మినార్, గోల్కొండ కోట, శిల్పారామం, లుంబినీ పార్క్, హుస్సేన్‌‌‌‌ సాగర్, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు హైటెక్‌‌‌‌ సిటీలోని ఆకాశ హర్మ్యాలు తిలకించనున్నారు. బుధవారం రాత్రి వారికి తారామతి బారాదరిలోనే బస ఏర్పాటు చేశారు.

అస్సలు అనుకోలే... 

తిండికే తిప్పలు పడుతున్న మేము పట్నం రావడం మామూలు విషయం కాదు. మమ్మల్ని హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్తామని అనగానే నాకు సంతోషం కలిగింది. చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌‌‌‌ పేరు వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు కండ్ల ముందు ఇన్ని మేడలు, ఇన్ని లైట్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వస్తానని నేనైతే అసలు అనుకోలేదు.– భాగ్యరాజన్, కొత్తగూడెం, ఉట్నూరు మండలం, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా

గాలి మోటార్‌‌‌‌ను కళ్లారా చూసినం 

నాకు 70 ఏండ్లు నిండాయి. ఈ వయసులో ఇక్కడి దాకా వస్తానని అనుకోలేదు. నా బతుకంతా ఆ అడవిలో, మా ఊళ్లలోనే గడిచిపోయింది. ఆకాశంలో ఎగిరే గాలి మోటార్‌‌‌‌ను ఎప్పుడూ దూరం నుంచే చూసేదాన్ని. అది ఎట్లా ఉంటదో, అంత పెద్దది ఎట్లా ఎగురుతదోనని ఆశ్చర్యపోయేదాన్ని. నేను చచ్చేలోపు దాన్ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు. ఈ ముసలి ప్రాణానికి ఇంతకన్నా ఏం కావాలి ? చాలా సంతోషంగా ఉంది.
–  మోతుబాయి, నాగోబాగూడెం, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

పట్నం చాలా బాగుంది. ఇక్కడ నీళ్ల సౌకర్యం చూస్తుంటే మా ఊరు గుర్తొస్తోంది. మా పల్లెల్లో కూడా ఇట్లనే నీళ్ల వసతి కల్పిస్తే ఎంత బాగుండు. మాకు నీళ్లు ఇస్తే మేమే కష్టపడి పంటలు పండించుకుంటాం. అప్పుడు మాకు తిండికి లోటు ఉండదు, ఎవరినీ చేయి చాచి అడగాల్సిన పని ఉండదు. సర్కారోళ్లు దయచేసి మా ఊర్లో నీళ్ల సమస్యను పరిష్కరించాలి. మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చి ఇవన్నీ చూపించినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. అసలు ఇవన్నీ చూస్తానని అనుకోలేదు. -అమృత, కొత్తగూడెం, ఉట్నూరు మండలం (ఆదిలాబాద్​ జిల్లా)