రివ్యూ: ‘సరిలేరు నీకెవ్వరు’

రివ్యూ: ‘సరిలేరు నీకెవ్వరు’

టీనటులు: మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి,ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, సంగీత ,వెన్నెల కిషోర్,సత్యదేవ్, సుబ్బరాజు, హరితేజ, బండ్ల గణేష్, అజయ్, రఘుబాబు తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: అనిల్ సుంకర – దిల్ రాజు
రచన – దర్శకత్వం: అనిల్ రావిపూడి
రిలీజ్ డేట్: జనవరి 11,2019

కథేంటి?

ఆర్మీలో మేజర్ గా ఉన్న అజయ్ (మహేష్ బాబు) ఓ మిషన్ లో భాగంగా తన టీమ్ తో వెళతాడు. టీమ్ లోని మరో అజయ్ (సత్యదేవ్) ఆ మిషన్ లో గాయపడి ప్రణాపాయ స్థితిలో ఉంటాడు. అయితే వాళ్ల ఇంట్లో జరిగే పెళ్లి పనులకు సాయం చేసి.. అజయ్ విషయాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పేందుకు పై ఆఫీసర్లు అజయ్ (మహేష్ బాబు) ను కర్నూలుకి పంపిస్తారు. అక్కడ అజయ్ వాళ్ల కుటుంబానికి మంత్రి నాగేంద్ర (ప్రకాష్ రాజ్) నుండి ప్రమాదం ఉంటుంది. అతని నుండి భారతి (విజయశాంతి) కుటుంబాన్ని ఎలా కాపాడాడు.? అతనికి ఎలా బుద్ది చెప్పాడనేది స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

మహేష్ బాబు ఫుల్ ఎనర్జీ ఉన్న రోల్ పోషించాడు. పోకిరి, దూకుడు తరహాలో మాస్ క్యారెక్టర్ చేసి మళ్లీ ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. హీరోయిన్ రష్మికకు పెద్దగా ప్రధాన్యత ఉన్న రోల్ దక్కలేదు. ఉన్నంత లో గ్లామర్ పండించింది. విజయశాంతి తన నటనతో పాత్రకు వన్నె తీసుకొచ్చింది. యాక్టింగ్ లో గ్యాప్ వచ్చినా కానీ.. పవర్ ఫుల్ పర్మార్మెన్స్ తో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ మరోసారి విలనీ పాత్రలో రాణించాడు. రావు రమేష్, పోసాని, సంగీత, రఘుబాబు, బండ్ల గణేష్, జయప్రకాష్ రెడ్డి అంతా నవ్వించడానికి ట్రై చేశారు.

టెక్నికల్ వర్క్:

రత్నవేలు సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గొప్పగా ఏం లేదు. పాటలు యావరేజ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రొటీన్ గా ఉంది. ఎడిటింగ్ బాగుంది.  నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తీశారు. అనిల్ రావిపూడి కొన్ని కామెడీ పంచ్ లతో ఎంటర్ టైన్ చేశాడు.

విశ్లేషణ:

‘‘సరిలేరు నీకెవ్వరు’’ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. హీరో తన ఫ్రెండ్ ఫ్యామిలీని కాపాడటం కోసం ఊరొస్తాడు. అక్కడ వాళ్లకు విలన్ నుండి ప్రమాదం ఉంటుంది. దాన్ని నుండి వాళ్లను కాపాడి విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి కథలు ఎన్నో వచ్చేశాయి. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఇట్టే చెప్పేయవచ్చు. ప్రెడిక్టబుల్ గా ఉన్న ఈ సినిమాను అనిల్ రావిపూడి తన మార్కు కామెడీ సీన్లతో పాస్ చేయించాలని చూశాడు కానీ.. తను ఇంతకు ముందు తను డైరెక్ట్ చేసిన హీరోలు వేరు. ఇప్పుడు తీస్తున్నది స్టార్ హీరోతో. అక్కడే తేడా కొడుతుంది. నిజం చెప్పాలంటే స్టార్ హీరోకు ఇలాంటి చిన్న పాయింట్ ఉన్న కథ సరిపోదు. ఏదో మ్యాజిక్ ఉండాలి. కానీ అనిల్ అదే కథ, అదే కథనంతో నడిపి బోర్ కొట్టించాడు. తన ఇదివరకటి సినిమాల్లో లాగే కొన్ని కామెడీ ఐటమ్స్ పెట్టే ప్రయత్నం చేశాడు కానీ.. అవేమంత పేలలేదు. ఉదాహరణకు ఫస్టాఫ్ లో ‘‘ట్రైన్ ఎపిపోడ్’’..రిలీజ్ ముందు ఈ ఎపిసోడ్ గురించి ఎంతో చెప్పారు కానీ..చెప్పినంత లేదు. నిజానికి ఇరిటేట్ చేస్తుంది. దానికి రావిపూడి పెట్టిన లవ్ ట్రాక్ సిల్లీగా ఉంటుంది. హీరోయిన్ తండ్రి తన పెద్ద కూతుళ్లిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని తనకు లేని రోగాలు అంటగట్టారని చిన్నకూతురికి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు.

ఆ హీరోయినేమో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. వాళ్ల అమ్మ, అక్కలు కూడా అంతే. ఆ పెళ్లిని ఎగ్గొట్టేందుకు 50 ఏళ్ల వయసున్న టికెట్ కలెక్టర్ ను పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అంటుంది. అదేమంటే..ఇదే కామెడీ, నవ్వుకోండి అంటాడు డైరెక్టర్. అలాంటి హీరోయిన్..హీరోను ట్రయిన్ లో చూడగానే పూనకం వచ్చినట్టు అతన్నే పెళ్లి చేసుకోవాలని వెంటపడుతుంది. రాత్రపూట హీరో కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి ‘‘నన్ను బలవంతం చేయబోయాడు. ఎలాగైనా అతనితో పెళ్లి చేసేయాలని’’అంటూ గోల చేస్తుంది. ఇక ఇదే ఎపిసోడ్ లో పెళ్లి మీద, ఆడవాళ్ల మీద హీరోయిన్ తండ్రి జోక్స్ వేస్తుంటాడు. ఇదే ‘‘అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ కామెడీ’’ ఈ డైరెక్టర్ ఇంతకుముందు సినిమా ‘‘రాజా ది గ్రేట్’’ లో కూడా ఆడవాళ్లను వాళ్ల భర్తలు అర్థం పర్థం లేకుండా కొడుతుంటారు. ఇలాంటి సీన్లు ఎలా రాసుకుంటారో అర్థం కాదు.

ఆ సోకాల్డ్ ట్రయిన్ ఎపిసోడ్ తర్వాత హీరో ఊరికొచ్చి ఫ్రెండ్ కటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడుతాడు. అక్కడ జరిగే జరిగే ఫైట్ సీన్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్ విషయానికొస్తే.. హీరో –విలన్ కు మధ్య జరిగే రెండు ఎపిసోడ్ లు బాగుంటాయి. మళ్లీ షరా మాములే. ఫోర్స్ డ్ సాంగ్స్, రాజకీయ నాయకుల అవినీతి గురించి క్లాస్ పీకడం.. తర్వాత ‘‘ది ఎండ్’’. ఇలా ఓవరాల్ గా ‘‘సరిలేరు నీకెవ్వరు’’ ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుంది.

బాటమ్ లైన్: ఫ్యాన్స్ వరకు ఓకే కావచ్చు కానీ.. ఓ మంచి సినిమా చూద్దాం అనుకునేవాళ్లకు పూర్తి సంతృప్తినివ్వదీ చిత్రం.