టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి తర్వాత అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, మూడు రోజులకే దేశవ్యాప్తంగా మిఠాయిలు పంపిస్తూ, 16 ఆలయాల్లో అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఆదివారం ఉదయం (మార్చి 1న) విజయ్ రష్మిక దంపతులు హైదరాబాద్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంను దర్శించుకున్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకున్న కొత్త జంటకు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు.
దర్శనం అనంతరం తమను చూడటానికి వచ్చిన అభిమానులకు వీరు స్వయంగా స్వీట్ బాక్సులను పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ రష్మిక లను చూడటానికి అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. వీరితో సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని చూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దేశవ్యాప్త నగరాల్లో స్వీట్లు:
విజయ్ రష్మిక దంపతులు.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్ల పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తమ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెడుతూ విషయాన్ని తెలియజేశారు. ‘‘మీరంతా మా ప్రయాణంలో, ప్రేమలో ఓ భాగం. మా పెళ్లి వేడుకలను మీతో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మనకు వేడుక అంటే స్వీట్లే. అందుకే స్వీట్లు, ప్రేమ నిండిన ట్రక్కులను మార్చి 1న దేశవ్యాప్తంగా పంపిస్తున్నాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అని విరోష్ జోడీ కోరింది. అయితే, హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావించే అన్నదానం కార్యక్రమాన్ని 16 దేవాలయాల్లో ఏర్పాటు చేయడం సినీ వర్గాల్లో విశేషంగా మాట్లాడుకుంటున్నారు.
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. బెంగళూరులోని శివోహం టెంపుల్, వృందావన్‌లోని శ్రీ శ్రీ కృష్ణ బలరామ్ మందిర్, హైదరాబాద్‌లోని హరే కృష్ణ హెరిటేజ్ టెంపుల్, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం సహా పలు ప్రముఖ దేవాలయాలు ఇందులో భాగమయ్యాయి. ఈ సందర్భంగా ‘‘పెళ్లి సంతోషం దేశమంతా.. నగరాల్లో స్వీట్లు, ఆలయాల్లో అన్నదానం.. శభాష్ విరోష్ జోడి’’ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే:
హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ, పుట్టపర్తిలో స్వీట్ల పంపిణీ చేపట్టనున్నారు. సాయిబాబా దేవాలయం (చింతపల్లి), మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (మహబూబ్‌నగర్), హరేకృష్ణ హెరిటేజ్ టెంపుల్ (హైదరాబాద్), శ్రీకనక మహాలక్ష్మి ఆలయం(విశాఖపట్నం), శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం (ద్వారకా తిరుమల), శ్రీకనకదుర్గ (విజయవాడ) అమ్మవారి ఆలయాల్లో అన్నదానం చేయనున్నారు.
ఇదిలా ఉండగా, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ప్రత్యేక అతిథులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు, తెరపై కూడా ఈ జంట మరోసారి కలిసి కనిపించనుంది. విజయ్–రష్మిక నటిస్తున్న కొత్త చిత్రం రణబాలి ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 28, 2026
