మిర్చి డబ్బులతో వ్యాపారి పరార్: 10 మంది రైతులకు చెందిన రూ.23 లక్షలు ఎగ్గొట్టిన ట్రేడర్

మిర్చి డబ్బులతో వ్యాపారి పరార్: 10 మంది రైతులకు చెందిన రూ.23 లక్షలు ఎగ్గొట్టిన ట్రేడర్
  • మహబూబాబాద్​ మార్కెట్​ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలోని పలువురు రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి పరారవడంతో ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో రైతులు మహబూబాబాద్​ వ్యవసాయ మార్కెట్​కు తాము పండించిన మిర్చి తీసుకువచ్చారు. మార్కెట్​లో ప్రభుత్వ ట్రేడ్​ లైసెన్స్​ కలిగిన వ్యాపారి ధరావత్​ శేఖర్ కు​రూ.23లక్షల విలువైన మిర్చిని అమ్మారు.

నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు పలుమార్లు అతడిని నిలదీశారు. ఇటీవల సదరు వ్యాపారి రూ. కోటికి పైగా అప్పులు చేసి కోర్టు ద్వారా ఐపీ పెట్టినట్లు తెలుసుకున్న రైతులు మంగళవారం మార్కెట్​ గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో గూడూరు మండలం ఎర్రగుంట తండాకు చెందిన మూడు హోలీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని టౌన్​ ఎస్సై గడ్డం ఉమ, పోలీసులు అడ్డుకొని నీళ్లు చల్లారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్​ సుధాకర్​ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. మార్కెట్​ అధికారులు, పోలీసుల ద్వారా డబ్బులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.