కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహించగా, సాయి రాజేశ్ కథను అందిస్తూ ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించారు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.40.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హీరో నాగచైతన్య మాట్లాడుతూ ‘ఇదొక కల్ట్ లవ్‌స్టోరీగా నిలుస్తుంది. కోవిడ్ తర్వాత ప్రేమకథలు తగ్గిపోయాయని భావించిన సమయంలో ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
సాయి రాజేష్ రాసిన కథ, రవి నంబూరి దర్శకత్వం, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ నటన సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. వచ్చే రోజుల్లో సినిమా మరిన్ని భారీ వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నా’ అని అన్నాడు. తన కెరీర్‌లో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కిరణ్ అబ్బవరం థ్యాంక్స్ చెప్పాడు.
ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమైనదని, ఇంత మంచి స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ గౌరీ ప్రియ చెప్పింది. దర్శకుడు రవి నంబూరి, రైటర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోందని తెలియజేశారు. మూవీ టీమ్ అంతాఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
