ములుగు: ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపడదాం : మంత్రి సీతక్క

ములుగు: ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపడదాం : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు ఎంపీడీవో ఆఫీస్​లో జరిగిన మండల సర్వసభ్య సమావేశం, జలసిరిపై అవగాహన సదస్సు అడిషనల్​ కలెక్టర్​ సంపత్ రావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇంటింటికీ ఇంకుడు గుంత, ఊరి కోసం ఊటకుంట, పంట కోసం పంటకుంట అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.

నీటి ఎద్దడిని తగ్గించేందుకు జలసిరి కార్యక్రమాన్ని మన ఇంటి సిరిగా భావించి భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం జలసిరి కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. అంతకుముందు మల్లంపల్లి మండలం ఎంపీడీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌పర్సన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మల్లంపల్లి సర్పంచ్​ ల్యాద శ్యాంరావు తల్లి ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు. 

అలర్ట్​గా ఉండాలి.. 

ములుగు జిల్లాకు రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం ములుగులో పర్యటించిన మంత్రి కలెక్టర్​ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమస్య వస్తే జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 7109కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.