తెలంగాణ ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ఫీజు రియంబర్స్ మెంట్ నిధుల్ని నేరుగా విద్యార్థుల ఖాతాలకే బదిలీ చేయాలని నిర్ణయించింది, ఇందుకోసం రాబోయే విధ్యాసంవత్సరం నుండి అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుండి ప్రైవేట్ కాలేజీలు ఎలాంటి ఫీజులు బలవంతంగా వసూలు చేయకూడదని పేర్కొంటూ స్పష్టమైన నిబంధనలు వెలువరించింది. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఉన్నత విద్యను బలోపేతం చేయడంలో కీలకంగా మారుతుందని విశ్లేషకులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశాన్ని నడిపించే ప్రపంచస్థాయి విద్యా సంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే విద్యకోసం అదే స్థాయిలో ఆలోచిస్తాయని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈనిర్ణయం మరోసారి చాటిచెప్పింది. ఈ నిర్ణయంతో విద్యాలయాల స్థాయి పెరగడం మొదలు కళాశాల స్థాయిలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం వరకూ ప్రతి స్థాయిలో వ్యవస్థాగత సంస్కరణలకు బీజం పడుతుంది. ఇప్పటికే ఎస్సీ విధ్యార్థులకు అమలు చేస్తున్న రీతిలో 2026–-27 విద్యాసంవత్సరం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా వారి ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలకే జమవుతాయి. ఇది పేద విద్యార్థుల జీవితాలను శాశ్వతంగా మార్చే చారిత్రాత్మక నిర్ణయమని విద్యావేత్తల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం 2021–-22 నుంచి నిర్దేశించిన ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం అనబడే ఎపీబీఎస్ సిస్టంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్నది మాత్రమే. దాంతో ఈ పథకం సంపూర్ణంగా పేదవిద్యార్థులకు, అల్పాదాయ వర్గాలకు అత్యుత్తమమైన, నాణ్యమైన ఉన్నత విద్యను అందించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో పేరుకున్న వేలకోట్ల బకాయిలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021–-22 నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ బడ్జెట్ కేటాయింపు దాదాపుగా నిలిచిపోయింది. కేంద్రం నిర్దేశించిన డీబీటీ విధానానికి గత ప్రభుత్వం అంగీకరించకపోవడం వెనకాల కూడా అనేక అంతుచిక్కని కారణాలున్నాయని విశ్లేషకులు అంటారు. ముఖ్యంగా ఆ పథకం అమలు చేస్తే ఏ విద్యా సంవత్సరం నిధులు అప్పుడే విడుదల చేయాల్సి రావడం ఒకటైతే సింహభాగం కాలేజీల యాజమాన్యాలతో ఏదోరకమైన సంబంధం, మిడిల్ మెన్ వ్యవస్థల ఏర్పాటు వంటివి చేసుకొని తద్వారా విధ్యార్థుల పీజు రియంబర్స్మెంట్ నిధుల్ని కోట్లాదిగా ఆక్రమణలు చేసారనేది మరోటీ. మొత్తంగా దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు దాదాపు 10,000 నుండి 12,000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. 13 లక్షలకు పైగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈబీసీ మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చింది నాటి ప్రభుత్వం. ఈ భారీ బకాయిల బాధ్యతను భుజాన మోస్తూనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని దశల వారీగా పరిష్కరిస్తూ, అదే సమయంలో కొత్త పారదర్శక వ్యవస్థను నిర్మిస్తోంది.
మధ్యవర్తుల దోపిడీకి ముగింపు...
గతంలో ఫీజు రీయింర్స్మెంట్ నిధులు కాలేజీ ఖాతాలకు నేరుగా వెళ్ళే విధానంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎన్నో వార్తా కథనాలు చూసాం. కాలేజీలు నకిలీ విద్యార్థుల పేర్లు చూపించడం, అర్హత లేని వారిని అర్హులుగా నమోదు చేయడం, వాస్తవానికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు తారుమారు చేయడం, తద్వారా పేద విద్యార్థులకు చేరాల్సిన నిధులను కొందరి జేబులు నింపడానికి వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా దారుణంగా, కొన్ని అనుంగు, అనుయాయుల ప్రైవేట్ కాలేజీలు బరితెగించి పీజుల పెంపు కోసం అడ్డదారుల్లో సాధించుకున్నాయని స్వయంగా విద్యార్థి సంఘాలే తెలంగాణ ఉన్నత విధ్యామండలికి ఫిర్యాదు చేశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ వెరిఫికేషన్, డీబీటీ విధానంతో ఇకపై ఇలాంటి అక్రమాలు అసాధ్యం, నకిలీ రికార్డులు సైతం అసాధ్యం, ప్రతి రూపాయి సక్రమంగా అర్హుడైన విద్యార్థికే నేరుగా చేరుతుంది.
ఆధార్ బయో అటెండెన్స్, నైపుణ్యాభివృద్ధికి బాటలు
తెలంగాణ ప్రజా ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా ఈ సంస్కరణల్లో మరో కీలక అడుగు వేస్తూ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను అమలు చేస్తోంది. నిర్ధిష్ట హాజరు శాతం ఉంటేనే పూర్తి పీజురియంబర్మెంట్ అవుతుంది కాబట్టి దీని వల్ల ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా కాలేజీకి హాజరవడం తప్పనిసరి అవుతుంది. తద్వారా పాఠాలను వినడం, నైపుణ్యాలను నేర్చుకోవడంతో ప్రతీ విద్యార్థి చదువు పూర్తి ప్రయోజనం పొందుతాడు. ఈ వ్యవస్థ వల్ల పేద విద్యార్థులు కేవలం రీయింబర్స్‌మెంట్ పేరిట నమోదు చేసుకొని, నిజంగా చదువుకోకుండా ఉండే ధోరణికి కూడా అడ్డుకట్ట పడుతుంది. క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థులకు నాణ్యమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇధి రెండు వైపులా పదునైన ఆయుదం లాంటిది, ఒక పథకంతో బహుళ ప్రయోజనాల్ని అందిస్తుంది.
కాలేజీల నాణ్యత పెరగడం తప్పనిసరి...
పీజును విధ్యార్థికి అందించడం, విధ్యార్థి హాజరును బయోమెట్రిక్ తో పర్యవేక్షించే వ్యవస్థ అమలుతో ప్రైవేట్ కాలేజీలపై మంచిరకమైన పోటీతో కూడిన ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు క్రమం తప్పకుండా వస్తున్నారంటే కాలేజీలు అవసరమైన మౌలిక సదుపాయాలు, లేబొరేటరీలు, అర్హులైన అధ్యాపకులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సరైన విద్య అందించకపోతే విద్యార్థులు ఆ కాలేజీలను వదిలిపెడతారు. తద్వారా నిధులు కూడా రావు. అందుకే కాలేజీలు నాణ్యతలు పెంచుకొని బలపడే ఆరోగ్యకరమైన వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు, ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడంతో పాటు విద్యాసంస్థలు నిజమైన విద్యాలయాలుగా మారే పరిస్థితి వస్తుంది. ఇదే తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టే సమగ్ర విద్యా సంస్కరణల సారం.
పారదర్శక తెలంగాణ.. సంపన్న తెలంగాణ...
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణ కేవలం ఒక పథకం మార్పు మాత్రమే కాదు. ఇది గత వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి, మధ్యవర్తులు, రాజకీయ దురాశలపై ప్రత్యక్ష కార్యాచరణతో ప్రభుత్వ నిధులు మొదటి నుండి చివరి వరకు అర్హులైన విద్యార్థులకే చేరేలా, ప్రతి రూపాయి పారదర్శకంగా వినియోగమయ్యేలా నిర్మించిన వ్యవస్థ ఇది. ఈ అంశంపై కొందరు కోర్టుల ద్వారా అడ్డుకట్టవేయాలని చూస్తున్నప్పటికీ మంచి లక్ష్యంతో చేస్తున్న సంస్కరణలను యావత్ సమాజం, సమస్త వ్యవస్థలు అభినందిస్తాయని మనకు చరిత్ర చెపుతోంది. . విద్యలో పారదర్శకత, నాణ్యత, సమానత్వం అవసరం.
బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో టీ సాట్ నెట్ వర్క్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
