గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్లాంట్‌ను మంగళవారం షట్‌డౌన్ చేశారు. స్టీమ్ పైప్‌లైన్ పగిలిపోవడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పైప్‌లైన్ మరమ్మతులకు సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉందని ఆఫీసర్లు తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ఇప్పటికే ఉత్పత్తి దెబ్బతిన్నది. రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇటీవల 1,700–1,900 మెట్రిక్ టన్నులకే పరిమితమైంది. ఈ ఏడాది వివిధ కారణాలతో 114 రోజుల పాటు ప్లాంట్ మూతపడటం వల్ల యాసంగి సీజన్‌పై ప్రభావం పడింది. రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
