- రైస్‌మిల్లర్లతో కలిసి ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ నిర్వాకం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొందరు రైస్ మిల్లర్లతో కలిసి ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
మిల్లుల నుంచి గోదాములకు బియ్యం రాకపోయినా, వచ్చినట్లుగా ఆన్‌లైన్ రికార్డుల్లో ఫేక్ ఐడీతో ఎంట్రీలు చేయడం ద్వారా సుమారు రూ.2 కోట్ల విలువైన బియ్యం దందా బయటపడింది. ఈ ఘటనపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఒక మిల్లుకు బదులుగా మరో మిల్లు పేరుతో ఆన్‌లైన్ ఎంట్రీ చేయడంతో అనుమానం వచ్చిన ఆఫీసర్లు రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో బాన్సువాడ డివిజన్‌కు చెందిన మూడు రైస్ మిల్లుల నుంచి గోదాములకు బియ్యం రాకపోయినా సుమారు 7 వేల క్వింటాళ్ల బియ్యం వచ్చినట్లు రికార్డుల్లో చూపించినట్లు తేలింది.
బియ్యం రాకుండానే ఎంట్రీలు..
ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లర్లు వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే కొన్ని మిల్లుల నుంచి బియ్యం రాకపోయినా వచ్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. సివిల్ సప్లయ్ డీఎం కార్యాలయంలో పనిచేసే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఫేక్ ఐడీతో ఈ ఎంట్రీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిని విధుల నుంచి తొలగించారు.
గతంలోనూ జరిగిందా..?
ఈ ఘటన వెలుగులోకి రావడంతో గతంలో కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయా అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయం, డీఎం ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిఫాల్ట్ జాబితాలో ఉన్న కొన్ని మిల్లర్లకు వడ్ల కేటాయింపు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో అప్పటినుంచి శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం 2024–25 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బకాయిలపై రికార్డులు పరిశీలిస్తున్న సమయంలో ఈ కుంభకోణం బయటపడింది. జిల్లాలో సుమారు 20 రైస్ మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల పర్యవేక్షణ లోపం..
సివిల్ సప్లయ్ డీఎం కార్యాలయంలో కీలకమైన ఆన్‌లైన్ ఎంట్రీలు, రికార్డు నిర్వహణ బాధ్యతలు ఎక్కువగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం వల్లే ఈ అవినీతి జరిగిందని భావిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. కుంభకోణం బయటపడడంతో అన్ని గోదాముల్లో నిల్వ ఉన్న సీఎంఆర్ బియ్యం స్టాక్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన బియ్యంపై పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించనున్నారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ తెలిపారు. బియ్యం రాకపోయినా వచ్చినట్లు ఎంట్రీ చేసిన ఫేక్ ఐడీని హెడ్ ఆఫీసుకు పంపించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
