- మొబిలైజేషన్ సమస్యతో ముందుకురాని సంస్థలు
- పది రిగ్గులు ఇచ్చేందుకు అంగీకరించిన ఓ సంస్థ
- మూడు బ్యారేజీల్లో కలిపి వంద బోర్‌హోల్స్ వేయాలని నిర్ణయం
- మేడిగడ్డలో 50.. మిగతా రెండు బ్యారేజీల్లో కలిపి 50
- మేడిగడ్డలో తొలుత పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లకు ‘రిగ్స్’ సమస్యగా మారుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జియోటెక్నికల్ టెస్టుల కోసం బోర్‌హోల్స్‌ను తవ్వాల్సి ఉంది. అయితే, బ్యారేజీల నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా దానికోసం ప్రత్యేకమైన రిగ్స్‌ను వాడాల్సి ఉంది. ఆ రిగ్స్ మన దగ్గర అందుబాటులో లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లోని ఏజెన్సీలను ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ఆయా రిగ్స్ ఏజెన్సీల నుంచి రిగ్గులను తెప్పించే బాధ్యతను ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్పెషల్ రిగ్స్ కలిగి ఉన్న దాదాపు 50 ఏజెన్సీలను గుర్తించినట్టు తెలిసింది. ఆయా ఏజెన్సీలతో రిగ్గులు తెప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, చాలా వరకు సంస్థలు రిగ్గులను పంపిచేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఒక సంస్థ మాత్రం ఓ పది రిగ్గులను పంపించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తున్నది. రిగ్గులను సప్లై చేయడానికి ఇబ్బందేమీ లేదని చెబుతున్న సంస్థలు.. వాటిని మొబిలైజేషన్తోనే ఇబ్బందులున్నాయని చెబుతున్నట్టు తెలిసింది.
రాజస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ అక్కడి నుంచి రిగ్గులను ఇక్కడి దాకా తీసుకురావడం.. మళ్లీ తీసుకెళ్లడం ప్రయాసతో కూడుకున్నదని చెప్పినట్టు తెలుస్తున్నది. అంతేగాకుండా ప్రభుత్వం కోట్ చేస్తున్న ధరకూ ఆయా సంస్థలు ఒప్పుకోవడం లేదని తెలిసింది. కొన్ని సంస్థలు ఒక్కో రిగ్గుకు రూ.20 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఉన్నదానికంటే డబుల్ రేటును కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ధరల విషయంలోనూ ఏజెన్సీలు తగ్గడం లేదని చెబుతున్నారు. రిగ్స్ వస్తేగానీ అక్కడ పనులు జరిగే పరిస్థితి లేదని అంటున్నారు.
టైమ్ లేదు..
మూడు బ్యారేజీలకు డిజైన్లు ఇవ్వాలన్నా.. రిపేర్లు చేయాలన్నా దాదాపు వెయ్యికిపైగా బోర్‌హోల్స్ వేసి జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్లు చేయాల్సి ఉంది. అయితే, టైమ్ తక్కువగా ఉండడంతో అన్ని బోర్‌హోల్స్ వేయలేని పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు పరిమిత సంఖ్యలోనే బోర్‌హోల్స్ వేసేందుకు నిర్ణయించారు. మొత్తంగా 3 బ్యారేజీల్లో కలిపి వంద వరకు బోర్‌హోల్స్ వేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజీల్లో దెబ్బతిన్న ఏడో బ్లాక్ వద్ద పూర్తిగా.. సమస్యలున్న పక్కపక్కన బ్లాక్‌ల వద్ద బోర్‌హోల్స్ వేయాలని నిర్ణయించారు.
మేడిగడ్డ బ్యారేజీలోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కనుక.. అక్కడ 50 బోర్‌హోల్స్ వేయాలని నిర్ణయించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలున్న ప్రాంతాల్లో 25 చొప్పున బోర్‌హోల్స్ వేయనున్నారు. వర్షాకాలంలోపు టెస్టులు పూర్తవ్వాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో తొలుత మేడిగడ్డ బ్యారేజీపైనే ఇరిగేషన్ వర్గాలు దృష్టి పెడుతున్నట్టు తెలిసింది.
మేడిగడ్డకు త్వరగా వరదలు
అన్నారం, సుందిళ్లతో పోలిస్తే మేడిగడ్డకు వరదలు త్వరగా మొదలవుతాయి. గోదావరితో పాటు ప్రాణహిత నది వరదలు వస్తాయి. ప్రాణహిత నుంచి గోదావరి కన్నా ముందే వరదలు మొదలవుతాయి కనుక.. మే రెండు లేదా మూడో వారం నాటికి మేడిగడ్డ వద్ద టెస్టులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిసింది. సరిపోనూ రిగ్గులు వస్తే.. మూడు బ్యారేజీల్లో సమాంతరంగా బోర్‌హోల్స్ వేయనున్నారు. ఒకవేళ లిమిటెడ్ సంఖ్యలోనే వస్తే మాత్రం తొలుత మేడిగడ్డ వద్ద వేసి.. ఆ తర్వాత వాటిని మిగతా రెండు బ్యారేజీల వద్దకు మొబిలైజ్ చేయాలని భావిస్తున్నారు.

