Team India: ఐపీఎల్ ముగిసిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్ తో భారత క్రికెట్ జట్టు రెడ్ బాల్ క్రికెట్ ఆడుతుండడం విశేషం. ఎలాగో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆఫ్ఘనిస్తాన్ భాగం కాకపోవడంతో ఈ టెస్టులో సీనియర్స్ ను రెస్ట్ లభించడం ఖాయంగా కనిపిస్తుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రాలతో కొంత మంది స్టార్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు కూడా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. గిల్ రెస్ట్ తీసుకోవడంతో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్ ముగింపుకూ, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు ఆరంభానికి మధ్య చాలా తక్కువ సమయం ఉంది. ఆటగాళ్లు అలసిపోకుండా వారి పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం జాగ్రత్త తీసుకుంటున్నట్లు వార్త కథనాలు వస్తున్నాయి. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మన జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. 2027లో వన్డేవరల్డ్ కప్ ఉండడంతో ఈ మూడు వన్డేల సిరీస్ కు పూర్తిస్థాయి భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్టుకు సీనియర్స్ కు రెస్ట్ ఇస్తే వన్డే సిరీస్ కు రెండు వారాల విరామం లభిస్తుంది. అప్పుడు వర్క్ లోడ్ లేకుండా వన్డే సిరీస్ లో ప్లేయర్స్ ఆడతారు. ఏదైనా ఐపీఎల్ ముగిసేలోపు అధికార ప్రకటన రానుంది.
స్టార్ ప్లేయర్స్ రెస్ట్ తీసుకోవడంతో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో బాగా రాణించిన వారికి ఈ టెస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ లభిస్తుంది. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న దేవ్ దత్ పడికల్ తో పాటు గత రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్ ల్లోనే 60 వికెట్లు పడగొట్టిన ఔకిబ్ నబీకి ఛాన్స్ దక్కనుంది. వీరిద్దరిపైనే అందరి దృష్టి నెలకొంది. సెలెక్టర్లను ఆకట్టుకున్న వారిలో ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుతార్ కూడా ఉన్నారు. ఐపీఎల్ ఫైనల్‌కు, ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా విరామం లేదు. కాబట్టి ఆటగాళ్లు అలసిపోకుండా సెలెక్టర్లు, యాజమాన్యం జాగ్రత్త పడతారు. ఎందుకంటే టెస్ట్ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ తో మూడు వన్డేలు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో వైట్-బాల్ సిరీస్ ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్ స్థానంలో మిడిల్ ఆర్డర్ లో పడికల్ ఆడనున్నాడు. జడేజా, కుల్దీప్ కు రెస్ట్ ఇస్తే ఆ స్థానంలో మానవ్ సుతార్ కు అవకాశం దక్కొచ్చు. బుమ్రా ప్లేస్ లో ఆకీబ్ నబీ జట్టులోకి రానున్నాడు. ఓపెనర్ రాహుల్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రావొచ్చు. యంగ్ స్టార్స్ కు అవకాశమిస్తే రానున్న ఏడాదిలో టీమిండియా కీలక టెస్ట్ సిరీస్ లలో వీరికి అవకాశం దక్కనుంది. వీటిలో ప్రధానంగా న్యూజిలాండ్ లో రెండు టెస్టులతో పాటు ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల బోర్డర్–-గవాస్కర్ ట్రోఫీ ఆడాల్సి ఉంటుంది. 2027 ఎండింగ్ లో వరల్డ్ కప్.. అదే ఏడాది జూన్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఉండడంతో భారత్ ఈ రెండు ఫార్మాట్ల పైనే ఎక్కువగా దృష్టి పెట్టనుంది.

