- మహాలక్ష్మి స్కీమ్‌తో భారీగా పెరిగిన సంఖ్య
- ట్రిప్పులు పెంచినా సరిపోవట్లే..
- 7 వేల బస్సులకు డిమాండ్
- నడుస్తున్నవి 3,200 మాత్రమే
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ లో బస్సు ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య మాత్రం పెంచడం లేదు. కొత్త బస్సులు ప్రవేశ పెడతామని అధికారులు చెప్తున్నా అవి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలకు బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ఆర్టీసీ ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో కొన్ని సర్వీసులను పెంచినా డిమాండ్‌కు తగ్గట్టు సరిపోవడం లేదు.
మహాలక్ష్మి స్కీం అమల్లోకి వచ్చిన తర్వాత ప్యాసింజర్ల సంఖ్య బాగా పెరిగింది. గతేడాది క్రితం వరకూ రోజుకు 20 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ప్రస్తుతం 26 లక్షలకు చేరినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులకు ప్రతి రోజూ అభ్యర్థనలు వస్తున్నాయి. కొన్ని రూట్లలో పెంచుతున్నా ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లోని కొన్ని కాలనీలకు రాత్రి 10గంటల తర్వాత సర్వీసులు నిలిపివేస్తున్నారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.
30 నుంచి 35 వేల ట్రిప్పులు
గ్రేటర్ పరిధిలో 7 వేల బస్సులకు డిమాండ్ఉండగా, ఆర్టీసీ మాత్రం 3,200 బస్సులను మాత్రమే నడుపుతోంది. ఏడాదిన్నర క్రితం వరకూ నగర రోడ్లపై ఆర్టీసీ బస్సులు రోజుకు సరాసరి 25 వేల ట్రిప్పులు తిరగ్గా ప్రస్తుతం 30 నుంచి 35 వేల ట్రిప్పులు తిప్పుతున్నారు. అయినా, ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నారు.
ఆర్టీసీకి అందుతున్న అభ్యర్థనలు
జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులకు పెద్ద సంఖ్యలో అభ్యర్ధనలు వస్తున్నాయి. అల్వాల్, కౌకూర్, కీసర వైపు నడిపే 8ఆర్, 22డి, 242 రూట్లలో మెట్రో డీలక్స్ బస్సులను నడపాలని రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. అలాగే మేడ్చల్, దుండిగల్, నిజాంపేట, గండిమైసమ్మ పరిధిలో వెలుస్తున్న కొత్తకాలనీలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, కొల్లూరు వంటి ప్రాంతాలకు నేరుగా సర్వీసులను నడపాలన్న డిమాండ్ కూడా వుంది.
అమీర్‌పేట, బోరబండ, ఉప్పల్, మెహదీపట్నం రూట్లో ఆర్డినరీ బస్సులు ఎక్కువ నడపాలన్న అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ రూట్లలో రాత్రి 10గంటల తర్వాత ఫ్రీక్వెన్సీలను పెంచాలని కోరుతున్నారు. సికింద్రాబాద్, చార్మినార్ వైపు కూడా బస్సుల ఫ్రీక్వెన్సీలను పెంచాలని, హైటెక్‌సిటీకి అన్ని రూట్ల నుంచి నేరుగా బస్సులు నడపాలన్న డిమాండ్లు ఉన్నాయి.
