కృష్ణా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి

కృష్ణా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తివేత.. జూరాల వద్ద 27 గేట్లు ఎత్తివేత

కృష్ణా నది లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద ప్రవాహం నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ పెరుగుతోంది. మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరద ఉగ్రరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లు ఎత్తారు. ఆల్మట్టి.. నారాయణపూర్ ల నుండి పెరిగిన వరద ప్రవాహం వల్ల తెలంగాణలోని గద్వాల సమీపంలోని జూరాల ప్రాజెక్టు వద్ద 27 గేట్లు ఎత్తేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

జూరాల వద్ద 27 గేట్లు ఎత్తివేత

ఎగువన ఆల్మట్టి.. నారాయణపూర్ల నుండి వరద నీటి విడుదల పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. సాయంత్రం ఏకంగా ఒక లక్షా 92 వేల క్యూసెక్కుల వరద నమోదు కావడంతో 27 గేట్లు ఎత్తేశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో మిగిలిన గేట్లను కూడా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. జూరాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి వద్ద ఇన్ ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉండగా.. 82 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 98 వేల 800 క్యూసెక్కుల వరదను దిగువన కృష్ణా నదిలోకి.. మరో 6 వేలు కర్నాటక పరిధిలోని కాలువలకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం జూరాలకు 1 లక్షా 92 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నిల్వ చేసే అవకాశం లేక మొత్తం నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

గంట గంటలకు పెరుగుతున్న వరద పోటు

కృష్ణా నదిలో వరద పోటు గంట గంటకూ పెరుగుతోంది. ఓ వైపు జూరాల నుండి వస్తున్న భారీ వరదకు తోడు.. మరో వైపు తుంగభద్ర నది వైపు నుండి కూడా సుమారు 70 వేల క్యూసెక్కులకు పైగా వరద తోడవుతోంది. దీంతో వరద మళ్లీ ఉధృత రూపం దాల్చింది. వరద పరవళ్లు తొక్కుతుండడంతో శ్రీశైలం డ్యాం గేట్లన్నీ పూర్తిగా ఎత్తేశారు. గతేడాదిలాగే ఈ సారి కూడా మంచి వర్షాలు కురవడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద ఉదయం 11 గంటల సమయంలో ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు సాయంత్రం 6 గంటల సమయంలో మిగిలిన ఐదు గేట్లను ఎత్తేశారు.  శ్రీశైలం డ్యాం వద్ద మొత్తం 12 గేట్లు ఉండగా.. 10 గేట్లను రెగ్యులర్ గా తెరుస్తారు. భారీ వరదలు వచ్చినప్పుడు.. డ్యాంకు ప్రమాదం ఉన్న అత్యవసర సమాయాల్లో మాత్రమే మిగిలిన రెండు గేట్లును ఎత్తుతారు. 2009లో ఒక్కసారి మాత్రమే మొత్తం 12 గేట్లను ఎత్తాల్సి వచ్చింది. అంతకు ముందు తర్వాత అంత భారీ  స్థాయిలో వరదలు మళ్లీ రాలేదు.

శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుండి 3 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3 లక్షల 76 వేల 670 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ.. మరో 30 వేల 879 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వీటితోపాటు శ్రీశైలం డ్యాంకు ఎగువన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, రాయలసీమకు మల్యాల, హంద్రీ-నీవా ద్వారా 1,350 క్యూసెక్కులు.. పోతిరెడ్డిపాడు ద్వారా 1500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తున్నారు. శ్రీశైలం లో విడుదల చేస్తున్న నీరంతా పులిచింతల, నాగార్జునసాగర్.. ప్రకాశం బ్యారేజీలకు చేరుకుంటోంది. ఈ ప్రాజెక్టులన్నీ ఇప్పటికే ఓవర్ ఫ్లో అవుతుండడంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేసేందుకు నాగార్జునసాగర్.. ప్రకాశం బ్యారేజీ అధికారులు సిద్ధంగా ఉన్నారు.