V6 News

మళ్లీ కుష్టు కలకలం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాయదారి రోగం.. రాష్ట్రంలో ఏటా 2,500కు పైగా కొత్త కేసులు

మళ్లీ కుష్టు కలకలం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాయదారి రోగం.. రాష్ట్రంలో ఏటా 2,500కు పైగా కొత్త కేసులు
  • చాపకింద నీరులా విస్తరిస్తున్న మాయదారి రోగం
  • 2005 లోనే.. నిర్మూలన దశలో ఉన్నట్లు ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుష్టు వ్యాధి (లెప్రసీ) మళ్లీ కలవరపెడుతున్నది ఒకప్పుడు కనుమరుగవుతున్నదిగా భావించిన ఈ మహమ్మారి, ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. 2005లోనే కుష్టు వ్యాధి నిర్మూలన దశకు చేరుకున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు వేరుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వేల సంఖ్యలో కొత్త కుష్టు కేసులు నమోదువుతున్నాయి. ఈ కేసుల్లో చిన్నారులు వందల సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 2024–-25లో 2,376 కుష్టు  కేసులు నమోదు కాగా, 2025–-26 నాటికి ఈ సంఖ్య 2,592కు చేరుకున్నది. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే, ఏటా సుమారు 100 మంది చిన్నారులు కుష్టు బారిన పడుతుండటం. గతేడాది 85 మంది పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 100కు పెరిగడం గమనార్హం. అవగాహన లేక చాలా మంది లక్షణాలను దాచిపెడుతుండటంతో, సమాజంలో ఇంకా బయటపడని కేసులు వేలల్లోనే ఉండొచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే వైకల్యం తప్పదు..

కుష్టు అనేది ‘మైకోబాక్టీరియం లెప్రా’ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే దీర్ఘకాలిక అంటువ్యాధి అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లపై ప్రభావం చూపుతుంది. చర్మంపై లేత రంగు, ఎర్రటి మచ్చలు రావడం ప్రధాన లక్షణాలు. చేతులు, కాళ్ల దగ్గర నరాలు గట్టిపడటం, తిమ్మిర్లు పట్టడం, చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా గాలిలోకి చేరి ఇతరులకు సోకుతుంది.

అయితే, బాధితులతో ఎక్కువ కాలం సన్నిహితంగా ఉంటేనే ఇది సోకే ప్రమాదం ఉంటుందని డాక్టర్ల స్పష్టం చేస్తున్నారు. కుష్టు వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చేతులు, కాళ్ల వేళ్లు వంకర్లు పోవడం, స్పర్శ లేకపోవడం వల్ల కాళ్లకు అయ్యే గాయాలు పుండ్లుగా మారి పాదాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు, గతేడాది రాష్ట్రంలో 41 మంది బాధితులకు తీవ్రమైన సమస్యల కారణంగా 'రీ-కన్స్ట్రక్టివ్' సర్జరీలు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. శరీరంపై ఎక్కడైనా స్పర్శ లేని మచ్చ కనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉచితంగా ఎండీటీ వైద్యం... 

కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉచిత చికిత్స అంటుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వ్యాధిని నయం చేసేందుకు మల్టీ డ్రగ్ థెరపీ (ఎండీటీ) అందుబాటులో ఉన్నాయని, ఈ మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి 6 నుంచి 12 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడవచ్చని, మందులు వాడటం ప్రారంభించగానే బాధితుడి నుంచి ఇతరులకు వ్యాధి సోకడం ఆగిపోతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సమాజంలో దాగున్న కేసులను గుర్తించడానికి ప్రభుత్వం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ), స్పర్శ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, ఆశా వర్కర్ల ద్వారా ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ కొత్త కేసులను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు సెల్ఫ్ కేర్ కిట్లు, ప్రత్యేక ఎంసీఆర్ పాదరక్షలను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని,  భయం విడిచి సకాలంలో చికిత్స పొందడమే కుష్టు నిర్మూలనకు  ఏకైక మార్గమని అధికారులు సూచిస్తున్నారు.