లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో యోగి సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన 9వ ఎడిషన్ దీపోత్సవ్ వేడుక కన్నులపండువగా సాగింది. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా 2,128 మంది పూజారులు, పండితులు, సరయు నదికి హారతి ఇచ్చారు. ఈ అద్భుత కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హారతి కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు.
దీంతో సరయు నది పరిసర ప్రాంతాలు కాంతులతో విరజిమ్ముతూ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే.. అయోధ్యలో నిర్వహించిన ఈ 9వ ఎడిషన్ దీపోత్సవ్ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదు చేసింది. అవేంటంటే.. ఒకేసారి 26,17,215 దియాలు (మట్టి దీపాలు) వెలిగించడం ఒకటి. అత్యధిక మంది (2,128 మంది పూజారులు) హారతి కార్యక్రమంలో పాల్గొనడం ఇంకొటి.
ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులను అధికారికంగా ధృవీకరించారు. అనంతరం యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (పర్యాటక మరియు సంస్కృతి) అమృత్ అభిజత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందజేశారు.
దీపోత్సవ్ కార్యక్రమం సందర్భంగా అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో భాగంగా సీఎం యోగి శ్రీరాముడు, సీత, లక్ష్మణుల వేషధారణలో కళాకారులకు హారతి ఇచ్చి పుష్పక విమాన రథాన్ని లాగారు. ఐదు దేశాల నుంచి కళాకారులు ప్రత్యేక రామ్‌లీలా ప్రదర్శనలో పాల్గొన్నారు. లేజర్ షో, లైట్ షో ఆకట్టుకున్నాయి.
