రోడ్డు నిర్మాణ వివాదంలో.. సివిల్ సర్వెంట్లకు హెచ్ఎండీఏ అధికారులకు మధ్య వాగ్వాదం

రోడ్డు నిర్మాణ వివాదంలో..  సివిల్ సర్వెంట్లకు హెచ్ఎండీఏ అధికారులకు మధ్య వాగ్వాదం

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో ఐఏఎస్, ఐపీఎస్, హెచ్ఎండీఏ (HMDA) అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ల్యాంకో హిల్స్ సమీపంలో 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టిన హెచ్ఎండీఏ పనులను ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS)అధికారులు అడ్డుకున్నారు. 2007 సంవత్సరంలో సర్వే నెంబర్ 454లో 57 ఎకరాల స్థలాన్ని ఆదర్శ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. తమకు కేటాయించిన స్థలంలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని సివిల్ సర్వెంట్ అధికారులు ఆరోపించారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్ల రోడ్డు నిర్మాణాల పనులు చేస్తోన్న హెచ్ఎండీఏ... మాస్టర్ ప్లాన్ రోడ్డును చూపి భారీగా హై రేజ్ అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ససేమిరా రోడ్డు వేయవద్దని పట్టుపట్టారు. ఏదేమైనా రోడ్డు వేసి తీరుతామని హెచ్ఎండీఏ అధికారులు అనడంతో గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విషయం తెలుకున్న నార్సింగి పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువురినీ సముదాయించి అక్కడ్నుంచి పంపించేశారు. కాగా ప్రస్తుతం హెచ్ఎండీఏ అధికారులు ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.