సిట్ కస్టడీకి బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

సిట్ కస్టడీకి బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
  • మరో ముగ్గురు పెడ్లర్లు కూడా..
  •     నేడు అదుపులోకి తీసుకోనున్న సిట్‌‌ అధికారులు
  •     చంచల్‌‌గూడ జైలులోనే నిందితులు
  •     వీకెండ్ పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసిన పెడ్లర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌ డ్రగ్స్‌‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోహిత్‌‌ రెడ్డి, ఆయన తమ్ముడు రితేశ్‌‌రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 4.30 గంటల వరకు మొత్తం 72 గంటలపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

దీంతో చంచల్‌‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను మంగళవారం ఉదయం 6 గంటలకు సిట్‌‌ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. శంషాబాద్‌‌ రూరల్ పోలీస్ స్టేషన్‌‌లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు.

తెరపైకి మరో ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల పేర్లు..

జైలులో ఉన్న ఈ ముగ్గురితోపాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌‌ యాదవ్‌‌ మినహా రోహిత్‌‌ రెడ్డి పీఏ శ్రవణ్‌‌కుమార్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌ శరత్‌‌కుమార్ సహా ఏడుగురు నిందితులను సిట్‌‌ అధికారులు విచారిస్తున్నారు. ఫామ్‌‌హౌస్‌‌ వీకెండ్‌‌ పార్టీలు సహా పబ్బుల్లో నిర్వహించిన పార్టీలకు మరో ముగ్గురు పెడ్లర్లు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు సిట్‌‌ విచారణలో తేలింది.

ఇప్పటికే నిందితుల బ్యాంక్ అకౌంట్లు, కాల్‌‌ డేటా ఆధారంగా రోహిత్ రెడ్డి సహా పార్టీలో పాల్గొన్న వారికి రెగ్యులర్‌‌‌‌గా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు సిట్‌‌ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు ఆ ముగ్గురు డ్రగ్‌‌ సప్లయర్ల కోసం సిట్‌‌ గాలిస్తోంది. కాగా, రోహిత్‌‌ రెడ్డి, రితేశ్‌‌రెడ్డి, నమిత్ శర్మ కస్టడీలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

పది రోజులుగా చంచల్‌‌గూడ జైల్లోనే రోహిత్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌ అజీజ్‌‌నగర్‌‌‌‌లోని రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌లోఈనెల14న వీకెండ్‌‌ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఫారిన్ లిక్కర్‌‌‌‌తోపాటు కొకైన్‌‌ సహా మరో మూడు రకాల డ్రగ్స్ తీసుకుంటూ రోహిత్‌‌ రెడ్డి సహా మొత్తం 11 మంది పోలీసులకు చిక్కారు. సోదాల సమయంలో పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినందుకు రోహిత్‌‌ రెడ్డి సహా ఆయన తమ్ముడు రితేశ్‌‌ రెడ్డి, ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన రియల్టర్‌‌‌‌ నమిత్‌‌ శర్మను పోలీసులు రిమాండ్‌‌కు తరలించారు. దీంతో పది రోజులుగా ఈ ముగ్గురు చంచల్‌‌గూడ జైలులోనే ఉన్నారు.