రోహిత్ మెరిసినా.. మూడో వన్డేలో 27 రన్స్‌ తేడాతో ఇండియా ఓటమి.. 2–1తో సిరీస్‌ ఇంగ్లండ్ సొంతం

రోహిత్ మెరిసినా.. మూడో వన్డేలో 27 రన్స్‌ తేడాతో ఇండియా ఓటమి.. 2–1తో సిరీస్‌ ఇంగ్లండ్ సొంతం

లండన్‌‌: ఇంగ్లండ్‌‌ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌‌ను చేజార్చుకుంది. ఛేజింగ్‌‌లో రోహిత్‌‌ శర్మ (110 బాల్స్‌‌లో 17 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 138) సెంచరీతో చెలరేగినా.. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో ఇండియా 27 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌ చేతిలో ఓడింది. ఫలితంగా హోమ్‌‌ టీమ్‌‌ 2–1తో సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. 

టాస్‌‌ గెలిచిన ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో 387/3 స్కోరు చేసింది. బెన్‌‌ డకెట్‌‌ (135 బాల్స్‌‌లో 18 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 141), జాకబ్‌‌ బెథెల్‌‌ (93 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 91), జో రూట్‌‌ (48 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 74 నాటౌట్‌‌) దంచికొట్టారు. తర్వాత ఇండియా 50 ఓవర్లలో 360/7 స్కోరుకే పరిమితమైంది. గిల్‌‌ (77), కోహ్లీ (74) మెరుగ్గా ఆడారు. బెథెల్​కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌, రూట్​కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌ అవార్డులు లభించాయి.

రోహిత్‌‌ మెరుపులు

ఛేజింగ్‌‌లో ఇండియాకు మెరుగైన ఆరంభం లభించింది. చాలా రోజుల తర్వాత హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ తన పాత ఆటను గుర్తు చేశాడు. గిల్‌‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపించడంతో స్కోరు వేగంగా ముందుకెళ్లింది. తొలి వికెట్‌‌కు 147 రన్స్‌‌ జత చేసి గిల్‌‌ వెనుదిరిగినా.. రోహిత్‌‌ మాత్రం ఇంగ్లిష్‌‌ బౌలింగ్‌‌ను ఉతికేశాడు. ఈ క్రమంలో 50 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ, 84 బాల్స్‌‌లో సెంచరీ చేశాడు. 

ఫలితంగా లార్డ్స్‌‌లో సెంచరీ చేసిన తొలి ఇండియన్‌‌ బ్యాటర్‌‌గా రోహిత్‌‌ రికార్డులకెక్కాడు. అలాగే ఇంగ్లండ్‌‌ గడ్డపై అత్యధిక సెంచరీ (8)లు చేసిన తొలి పర్యాటక ప్లేయర్‌‌గా నిలిచాడు. రెండో వికెట్‌‌కు 103 రన్స్‌‌ జోడించి రోహిత్‌‌ వెనుదిరిగాడు. ఇషాన్‌‌ కిషన్‌‌ (14)తో కలిసి ఇన్నింగ్స్‌‌ను నడిపించిన కోహ్లీ ఉన్నంతసేపు మెరుగ్గా ఆడాడు.  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (0), కేఎల్‌‌ రాహుల్ (12), అక్షర్‌‌ పటేల్‌‌ (2) విఫలమయ్యారు.   

బౌలర్లు ఫెయిల్‌‌.. 

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు తేలిపోయారు. ఎడమ మోకాలి గాయం కారణంగా బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మిగతా యంగ్‌‌ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ప్రసిధ్‌‌ కృష్ణ (2/69), అర్ష్‌‌దీప్ సింగ్ (0/72), ప్రిన్స్ యాదవ్ (1/79), గుర్నూర్ బ్రార్ (0/97) లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌ దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకున్న డకెట్‌‌, బెథెల్‌‌ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. పవర్‌‌ప్లేలో 58/0 స్కోరు చేసిన ఈ ఇద్దరు దాదాపు 30 ఓవర్లు స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించారు. 51 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన బెథెల్‌‌ 31వ ఓవర్‌‌లో ప్రసిధ్‌‌కు వికెట్‌‌ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్‌‌కు 192 రన్స్‌‌ రికార్డు భాగస్వామ్యం ముగిసింది. 

ఈ దశలో వచ్చిన రూట్‌‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. అనుభవం లేని ఇండియా బౌలింగ్‌‌పై ఎదురుదాడి చేశారు. అక్షర్‌‌ పటేల్‌‌ (0/61) మినహా రెండో స్పిన్నర్‌‌ లేకపోవడం కూడా ఇండియాకు శాపంగా మారింది. 108 బాల్స్‌‌లో సెంచరీ చేసిన డకెట్‌‌ను 44వ ఓవర్‌‌లో ప్రిన్స్‌‌ యాదవ్‌‌ వెనక్కి పంపాడు. రెండో వికెట్‌‌కు 101 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. మరో మూడు ఓవర్ల తర్వాత హ్యారీ బ్రూక్‌‌ (14) కూడా ఔట్‌‌ కావడంతో స్కోరు 324/3గా మారింది. రూట్‌‌తో కలిసిన బట్లర్‌‌ (13 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 41 నాటౌట్‌‌) మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌‌కు 63 రన్స్‌‌ జత చేయడంతో ఇంగ్లండ్‌‌ భారీ స్కోరు చేసింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌: 50 ఓవర్లలో 387/3 (డకెట్‌‌ 141, బెథెల్‌‌ 91, ప్రసిధ్‌‌ కృష్ణ 2/69). ఇండియా: 50 ఓవర్లలో 360/7 (రోహిత్‌‌ 138, గిల్‌‌ 77, కోహ్లీ 74, సామ్‌‌ కరన్‌‌ 4/75).