Rohit Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix), ముంబై ఇండియన్స్ లోగోలతో ఉన్న ఒక స్క్రిప్ట్ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఏమిటా 'డ్రాఫ్ట్ #45':
రోహిత్ శర్మ షేర్ చేసిన ఫోటోలో 'Draft #45' అని రాసి ఉన్న ఒక స్క్రిప్ట్ కనపడుతుంది. దాంతో ఈరో తేదీ (ఏప్రిల్ 9, 2026) ఉండటంతో పాటు టైటిల్ చివరలో 'Champion' అనే పదం క్లియర్ గా కనిపిస్తోంది. ఇది హిట్ మ్యాన్ జీవిత చరిత్ర (Biopic) కావొచ్చని లేదా ముంబై ఇండియన్స్ జట్టు సాధించిన విజయాలపై తీస్తున్న డాక్యుమెంటరీ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐపీఎల్ లో రోహిత్ దూకుడు:
ఒకవైపు సినిమాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున బిజీగా ఉన్నాడు. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతాపై రోహిత్ 78 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత ఢిల్లీపై 35 పరుగులు చేసినప్పటికీ, రాజస్థాన్‌తో జరిగిన వర్షం ప్రభావిత మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ 118 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో కొనసాగుతున్నాడు.
ముంబై ఇండియన్స్ ప్రస్తుత పరిస్థితి:
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టీమ్ మళ్ళీ విజయాల బాట పట్టాలంటే రోహిత్ శర్మ తన పాత ఫామ్‌ను అందుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మైదానంలో బౌలర్లను భయపెట్టే రోహిత్, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అనేది వేచి చూడాలి. ఈ 'ఛాంపియన్' ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
