రోజ్​గోల్డ్​ బ్యూటీపార్లర్ నిర్వాహకుల అరెస్ట్

రోజ్​గోల్డ్​ బ్యూటీపార్లర్ నిర్వాహకుల అరెస్ట్

 మెదక్, వెలుగు : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ మహిళలను మోసగించిన వ్యక్తులను శుక్రవారం మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇస్మాయిల్, సమీన దంపతులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి హైదరాబాద్ తో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయించారు. ఒక్కొక్కరి నుంచి అడ్వాన్స్ గా రూ.3 లక్షల చొప్పున తీసుకున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్ సప్లై చేస్తామని, నెలకు రూ.35 వేల జీతం ఇస్తామని చెప్పి మోసగించారు.

 కొన్ని నెలలు మాత్రమే జీతాలు, మెటీరియల్ ఇచ్చి ఆ తర్వాత జీతాలు ఇవ్వకుండా, బ్యూటీ పార్లర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవ్వకుండా మోసం చేశారు.  కొన్ని రోజులకు ఎవరికీ తెలియకుండా సంస్థని ఎత్తివేశారు. ఈ మోసాన్ని  గత నెల 30న వెలుగు పత్రిక ‘రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో బురిడీ’ శీర్షికతో పబ్లిష్​చేసింది. దీంతో రోజ్ గోల్డ్ సంస్థపై జిల్లాలోని వివిధ పీఎస్​లలో కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టి పోలీసులు గోల్డ్ బ్యూటీ పార్లర్ సంస్థ నిర్వాహకులు ఎస్.కే. ఇస్మాయిల్ పాషా, సమీనా, సిరిపోగు ప్రేమ కుమారి, బెంజమిన్ దేవ కుమారి అలియాస్ దేవిక అలియాస్ జేసిక, సిరిపోగు రవి, విశ్వతేజ, ఎస్. కే. జాన్ పాషాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ టౌన్ సీఐ దిలీప్ కుమార్ తెలిపారు.