సరూర్ నగర్‎లో ఏంటీ ఆరాచకం..! రెస్టారెంట్‎లో తిన్నదానికి బిల్లు కట్టమంటే కత్తులు, కట్టెలతో దాడి

సరూర్ నగర్‎లో ఏంటీ ఆరాచకం..! రెస్టారెంట్‎లో తిన్నదానికి బిల్లు కట్టమంటే కత్తులు, కట్టెలతో దాడి

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్‎లో బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యంపై కత్తులు, కట్టెలతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సరూర్ నగర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

వివరాల ప్రకారం.. 2026, మే 2వ తేదీ రాత్రి ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి, వారి అనుచరులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్బన్ రెస్టారెంట్ వెళ్లారు. బిల్లు డిస్కౌంట్ విషయంలో వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, వీరి అనుచరులు రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యంపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. 

కత్తులు, కట్టెలతో దాడి చేయడంతో పలువురు సిబ్బంది, రెస్టారెంట్ యాజమాన్యం గాయపడ్డారు. రెస్టారెంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేసి వీరంగం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. ఈ ఘటనపై రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యం సరూర్ నగర్ పోలీస్  స్టేషన్ ‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పరారీలో ఉన్న ప్రధాన నిందితులు ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలకు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త (లలిత్ ను) దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితుడు ఏదుల ప్రసన్ రెడ్డి ఉన్నత అధికారుల పేర్లు చెప్పుకొని బార్లు, రెస్టారెంట్లలో వసూళ్ల దందా సాగిస్తున్నట్టు సమాచారం.