ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ ముందు 223 పరుగుల టార్గెట్

ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ ముందు 223 పరుగుల టార్గెట్

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీలతో పాటు దేవదత్ పడిక్కల్ అద్భుత ఇన్నింగ్స్ బూస్టింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.

పడిక్కల్, కోహ్లీ జోరు: 
ఇన్నింగ్స్ ఆరంభంలో ఆర్సీబీకి ఆశించిన మేర ఓపెనింగ్ లభించలేదు. ఓపెనర్ జాకబ్ బెథెల్ (11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పడిక్కల్ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. కానీ, హాఫ్ సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

వెంకటేష్ అయ్యర్ విధ్వంసం: 
మరోవైపు క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడుతూ తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. అర్ధశతకం తర్వాత మరింత వేగంగా ఆడే క్రమంలో యుజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో కోహ్లీ వెనుతిరిగాడు. ఇక కోహ్లీ అవుటైనా తర్వాత వెంకటేశ్ అయ్యర్ చివర్లో దుమ్మురేపే బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లను బాదుతూ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆఖర్లో టీమ్ డేవిడ్ కూడా కొన్ని భారీ బౌండరీలు బాదడంతో ఆర్సీబీ స్కోరు 222 చేయగలిగింది. 

పంజాబ్ బౌలింగ్: 
పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ కట్టడిగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ సాధించారు. మిగితా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.