న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో రైతులు అధికంగా అప్పులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ‘టాప్–5’లో నిలిచింది. జులై 2018–- జూన్ 2019 మధ్య తెలంగాణ రైతు కుటుంబ సగటు అప్పు రూ.1,52,113 అని కేంద్రం వెల్లడించింది. మంగళవారం లోక్ సభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎంపీ కె. సోరెన్ ఖేర్వాల్ అడిగిన ప్రశ్న కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైతు కుటుంబ సగటు అప్పు రూ.74,121అని తెలిపారు. అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.
దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ, ఐదో స్థానంలో తెలంగాణ ఉన్నాయని పేర్కొన్నారు. జులై 2018–- జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబ సగటు అప్పు రూ.2,35,554 గా నమోదైందని వెల్లడించారు. వ్యవసాయ గృహాల పరిస్థితి అంచనా సర్వే (ఎస్ఏఎస్) ద్వారా లెక్కిస్తారని వివరించారు.
