ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1,618 కోట్లు చెల్లింపు : ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1,618 కోట్లు చెల్లింపు :  ఎండీ వీపీ గౌతమ్
  • లక్షా 50 వేల మందికి ప్రభుత్వ సాయం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్ల నిధులు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్​ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల ఇండ్ల పనులు ప్రారంభం కాగా.. లక్షా యాభై వేలకు పైగా ఇండ్లకు చెల్లింపులు చేసినట్టు బుధవారం ఓ ప్రకటనలో ఎండీ తెలిపారు. 

బేస్​మెంట్ స్థాయిలో 1,21,076 ఇండ్లకు రూ.1,210.76 కోట్లు, గోడలు పూర్తయిన 25,264 ఇండ్లకు రూ.252.64 కోట్లు, స్లాబ్ పూర్తి చేసిన 7,772 ఇండ్లకు రూ.155.44 కోట్లు చెల్లించామని ఎండీ పేర్కొన్నారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తున్నామని చెప్పారు. ఈ వారంలో 17 వేల ఇండ్లకు రూ.188.35 కోట్లు విడుదల చేశామ తెలిపారు. 

ఇంటి నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు మొత్తం 5 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వివరించారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా బిల్లు మొత్తం జమ కానిపక్షంలో వారు తమ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నంబర్ ను ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. 12 వేల గ్రామాలు, 4 వేల మున్సిపల్ వార్డుల్లో ఇండ్ల పనులు జరుగుతున్నాయని.. నిర్మాణం పూర్తయిన వెంటనే గృహ ప్రవేశాలు జరుగుతున్నట్టు ఎండీ గౌతమ్ వెల్లడించారు.