దేశంలోనే రికార్డ్ ధర.. హైదరాబాద్‎లో ఎకరం రూ.177 కోట్లు

దేశంలోనే రికార్డ్ ధర.. హైదరాబాద్‎లో ఎకరం రూ.177 కోట్లు

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో భూముల ధరలు కొత్త రికార్డ్ సృష్టించాయి. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గంలోని భూమి దేశంలోనే అత్యధిక ధర పలికింది. తద్వారా తన రికార్డ్‎ను తానే హైదరాబాద్ బ్రేక్ చేసింది. గతంలో హైదరాబాద్‎లోని కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలికి రికార్డ్ క్రియేట్ చేసింది. 

తాజా వేలంలో ఈ రికార్డ్ బద్దలు అయ్యింది. కనీవినీ ఎరుగని రీతిలో రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లకు అమ్ముడుపోయింది. హైదరాబాద్‎లో రియల్ ఎస్టేట్ రంగం డీలా పడిపోతుందని.. భూముల విలువ క్రమంగా తగ్గిపోతుందని ప్రచారం జరుగుతోన్న వేళ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్ల రికార్డ్ ధర పలకడం గమనార్హం. 

రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాన్ని సోమవారం (అక్టోబర్ 6) టీజీఐఐసీ వేలం వేసింది. టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలానికి అనూహ్య స్పందన లభించింది. భూమి దక్కించుకునేందుకు వేలంలో పలు సంస్థలు చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఎకరా ధరను టీజీఐఐసీ రూ.101 కోట్లుగా ఫిక్స్ చేయగా.. ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ రికార్డ్ ధరతో భూమి దక్కించుకుంది. ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున మొత్తం 7.6 ఎకరాల భూమిని  రూ.1357 కోట్లకు సొంతం చేసుకుంది.