కిడ్స్ ​కాంటెస్ట్​ పేరిట రూ.2.8 లక్షల మోసం..పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

కిడ్స్ ​కాంటెస్ట్​ పేరిట రూ.2.8 లక్షల మోసం..పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

బషీర్​బాగ్/పద్మారావునగర్, వెలుగు: కిడ్స్ టాలెంట్ కాంటెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు సిటీకి చెందిన ఓ మహిళను చీట్​చేశారు. సికింద్రాబాద్ లో ఉండే మహిళను వండర్ కిడ్స్ ప్రతినిధులమంటూ సైబర్​నేరగాళ్లు ఫేస్ బుక్ ద్వారా సంప్రదించారు. కిడ్స్ టాలెంట్ మోడల్ కాంటెస్ట్ –2025 నిర్వహిస్తున్నామని, ఇందులో పాల్గొనే చిన్నారులకు అజీయో, జారా కిడ్స్, హెచ్&ఎమ్, మదర్ కేర్ వంటి ప్రముఖ కంపెనీల యాడ్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని నమ్మబలికారు. పిల్లల వివరాలు తెలుసుకున్నారు. 

తరువాత టెలిగ్రామ్ ద్వారా మహిళతో కాంటాక్ట్​అయ్యారు. కాంటెస్ట్​లో పాల్గొంటే బట్టలు ఉచితంగా అందజేస్తామని అడ్రెస్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్ పూర్తిచేయడానికి పలు టాస్క్ లు ఇచ్చారు. ఫేస్ బుక్ లోని కొన్ని పేజీలను లైక్​చేసి, వాటిని స్క్రీన్ షార్ట్స్ పంపిస్తే చాలు అన్నారు. ఈజీ పనే కదా అని సదరు మహిళ ఆ టాస్క్ లను పూర్తి చేసింది. తరువాత ఆన్​లైన్​లో మూడు ఆర్డర్లు చేసి, డబ్బులు చెల్లించాలని, వాటిని తిరిగి పంపిస్తామని మహిళతో స్కామర్లు చెప్పారు. బాధితురాలు రూ.5వేలు, రూ.18వేలు, రూ.58వేలు ప్రొడక్ట్స్ ను బుక్ చేసి పేమెంట్​చేసింది. 

అయితే తర్వాత ఆర్డర్లు తప్పుగా ప్లేస్ అయ్యాయని, సిస్టమ్ క్రాష్ అయిందని చెప్పి స్కామర్లు మహిళతో రూ.98 వేలు ట్రాన్స్​ఫర్​చేయించుకున్నారు. తర్వాత మరో రూ.1,69వేలు పంపాలని ఒత్తిడి చేసి రూ.లక్ష ట్రాన్స్​ఫర్​చేయించుకున్నారు. మరోసారి టాస్క్ లు ఇచ్చి డబ్బులు చెల్లించాలని కోరడంతో ఇదంతా స్కామని తెలుసుకున్న బాధితురాలు డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా, స్కామర్లు స్పందించలేదు. తాను మొత్తం రూ. 2,79,000 పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది. కేసు ఫైల్​చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.

అధిక లాభాలంటూ 1.60లక్షలు.. 

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఓ మహిళను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. రూ.1.60 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్​కార్కానాకు చెందిన మహిళను ఇటీవల సైబర్​నేరగాళ్లు ఫోన్​లో సంప్రదించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ గోల్డ్ మర్చంట్‌ ప్లాట్‌ఫాం అనే వెబ్‌సైట్‌ పేరుతో టెలీగ్రామ్ లింక్ పంపారు. దాన్ని క్లిక్​చేసి, పెట్టుబడి పెట్టిన ప్రతిసారి మహిళ బ్యాంక్​అకౌంట్​లో డబ్బులు జమ అవుతూ వచ్చాయి. నిజమేనని నమ్మిన ఆమె రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టింది. తర్వాత లాభాలు రాకపోగా పెట్టుబడి పైసలు పోయాయి. దీంతో బాధితురాలు కార్ఖానా పోలీసులను ఆశ్రయించింది.