హైదరాబాద్ లో రూ.76.87 లక్షల హవాలా నగదు పట్టివేత ..గోషామహల్లో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ లో రూ.76.87 లక్షల హవాలా నగదు పట్టివేత ..గోషామహల్లో ముగ్గురు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: భారీగా హవాలా నగదు తరలిస్తున్న ముగ్గురిని హైదరాబాద్​లోని గోషామహల్​పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్ ప్రాంతానికి చెందిన జోటార్మ్, గణపతి రామ్, రాకేశ్​దేవాసి కొంతకాలంగా హవాలా మార్గంలో డబ్బులను అవసరమైన వ్యక్తులకు చేరవేస్తున్నారు.

సగం నోటు ముక్క ఆధారంగా నగదు అందిస్తున్నారు. సోమవారం రాత్రి ఈ ముగ్గురు బేగంబజార్ నుంచి గోషామహల్ జ్ఞాన్‌‌‌‌బాగ్ కాలనీ గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ షాప్ వద్దకు డబ్బులతో వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నారు. మూడు బ్యాగుల్లో రూ.76.87 లక్షలు లభ్యమయ్యాయి.

సంబంధిత ఆధారాలు చూపించాలని అడిగితే.. వారు చూపించలేదు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బేగంబజార్‌‌‌‌కు చెందిన సందీప్, కార్తీక్ సూచన మేరకు అఫ్జల్‌‌‌‌గంజ్‌‌‌‌కు చెందిన వ్యాపారి రాగరామ్‌‌‌‌కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.