- టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నివేదిక: ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఒళ్లంతా విషం నింపుకొని విద్యావ్యవస్థపై రిపోర్ట్ తయారు చేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రిపోర్ట్ ఉందన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. టీచర్ల జీతాన్ని నిర్ణయించాల్సింది విద్యా కమిషన్ కాదని, పీఆర్సీ అన్నారు.
విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్, కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారని, ఇప్పుడు విద్యాకమిషన్ రిపోర్ట్ తో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసే కుట్ర చేశారని ఫైర్అయ్యారు. రూ.7,900 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమంతో 25 వేల స్కూళ్లను కేసీఆర్ బాగు చేశారన్నారు. గురుకులాలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు , స్పోర్ట్స్ అకాడమీలు ఇలా ఎన్నో కేసీఆర్ హయాంలో ప్రారంభించిన విషయం ఆకునూరి మురళికి కనిపించలేదా అన్నారు.
విద్యావ్యవస్థకు రాజకీయాలు జత చేయొద్దని మురళి అంటూనే కేసీఆర్ ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ద్వారా అడ్మిషన్లు ఇవ్వాలని కమిషన్ చెబుతోందని, ఇలా చేస్తే నష్టపోయేది గ్రామీణ విద్యార్థులేనని పేర్కొన్నారు. ఈ సిఫార్సు కార్పొరేట్ కాలేజీలకు మేలు కలిగిస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను రద్దు చేయాలని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని, ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు.
