కేసీఆర్ డిజైన్ వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ డిజైన్ వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  •    కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ దోపిడీ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  •     పాస్‌‌‌‌పోర్టుల బ్రోకర్‌‌‌‌ సీఎం కావడం దురదృష్టకరం 
  •     25 మందితో బీఎస్పీ మూడో జాబితా విడుదల 

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అన్నీ తానై చీఫ్ ఇంజినీర్​లా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి, నాసిరకంగా కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 25 మంది అభ్యర్థులతో బీఎస్పీ మూడో జాబితాను ఆయన శనివారం లక్డీకాపూల్​లోని ఆఫీసులో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన మొత్తం 87 స్థానాల్లో 59 జనరల్, 17 ఎస్సీ, 11 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. అందులో ఎస్సీ వర్గాలకు 32 స్థానాలు కేటాయించగా బీసీ వర్గాలకు 33 సీట్లు, ఎస్టీ 13 సీట్లు, జనరల్ 4 సీట్లు, మైనారిటీలకు 5  సీట్లు ఉన్నాయి. 

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మరో 32 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ప్రాజెక్టు నాసిరకంగా కట్టి, రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేశారని ఆరోపించారు. కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసం కేసీఆర్ కక్కుర్తిపడి ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేసి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చారని ఆరోపించారు. 

రూ.లక్ష కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చి ప్రజాధనాన్ని లూటీ చేశారని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలు పాటించనందుకే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారన్న ఆయన వాటిని సైతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించాలని కోరారు. పాస్‌‌‌‌ పోర్టుల బ్రోకర్‌‌‌‌, ఫేక్‌‌‌‌ కరెన్సీ రాకెట్‌‌‌‌ నడిపిన దొంగ రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమన్నారు.

కేసీఆర్​పై ఈసీకి ఫిర్యాదు

గజ్వేల్ ​నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కేసీఆర్..​ ఉద్దేశపూర్వకంగానే తన అఫిడవిట్​లో స్థిరాస్తుల వివరాలు వెల్లడించలేదని ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి శనివారం ఫిర్యాదు చేశానని తెలిపారు. 

ఎర్రవల్లిలో తన పేరుతో ఉన్న భూమల వివరాలను ఎన్నికల అఫిడవిట్​లో కేసీఆర్ ​చూపించలేదన్నారు. ఆయనపై క్రిమినల్​ కేసు నమోదు చేసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు.