
చండూరు, వెలుగు : లిక్కర్ స్కాంలో కేసీఆర్ బంధువు అభిషేక్ రావు అరెస్టయిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అరెస్టవుతుందని తెలిసే కాపాడుకోవడం కోసం కేంద్రంతో మంతనాలు జరపడానికి సీఎం ఢిల్లీకి వెళ్లారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం బహుజన రాజ్యాధికార యాత్ర చండూరు మండలం గుండ్రపల్లి, తుమ్మలపల్లి, దోనిపాముల, నర్మెట, కొండాపురం, తేరటుపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, ఒప్పందం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఈ దొరలకు ఎన్ని సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయకుండా ఆస్తులను మాత్రమే కూడబెట్టుకున్నారని ప్రజలు గుర్తించారన్నారు. బహుజన రాజ్యం వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకరిని విదేశాలకు పంపి చదివిస్తామని, భూమి లేని నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని, నిరుద్యోగ యువతకు పదిలక్షల ఉద్యోగాలు ఇస్తామని, పేదల భూములకు పట్టాలిస్తామన్నారు.
బెల్ట్ షాపులను రద్దు చేసి వందేళ్లు బతికేలా చూస్తామన్నారు. ఇప్పటికీ చండూరులో బుడిగెజంగాలు, ఎరుకల కులాలు చెత్త ఏరుకుని బతుకుతున్నారని గుర్తుచేశారు. గుండ్రపల్లిలో నాయీబ్రాహ్మణ కులస్తులను కలిసి మాట్లాడారు. కొండాపూర్ గ్రామంలో దుబ్బాక వెంకన్న ఇటీవల ప్రమాదానికి గురవడంతో వెన్నెముకకు గాయమైంది. విశ్రాంతి తీసుకుంటున్న వెంకన్నను ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అదే సమయంలో వెంకన్నను పరామర్శించడానికి వచ్చిన రేవంత్‌రెడ్డి అక్కడే ఉన్న ప్రవీణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నాయకులు జగన్నాథగౌడ్, ప్రమీల, నర్ర నిర్మల, సుజాత,
గణేశ్,శివ తదితరులు పాల్గొన్నారు.