ప్రశాంతంగా ముగిసిన ఆర్ఎస్ఎస్ ర్యాలీ

ప్రశాంతంగా ముగిసిన ఆర్ఎస్ఎస్ ర్యాలీ

భారీ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా ముగిసిన కార్యక్రమం

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం భారీ పోలీస్ భద్రత మధ్య ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 500 మంది కార్యకర్తలు పథ సంచాలన్​లో పాల్గొన్నారు. పట్టణంలోని సుభద్ర వాటిక శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నుంచి భగత్​సింగ్ చౌక్, వివేకానంద చౌరస్తా, పద్మావతి కాలనీ, వినాయక్ నగర్, ఐబీ చౌరస్తా, శివాజీ చౌక్ మీదుగా సాగిన స్వయం సేవకుల కవాతు అందరినీ ఆకట్టుకుంది. బాల స్వయం సేవకులు సైతం యూనిఫాంతో కవాతులో పాల్గొన్నారు. స్వయం సేవకులపై మహిళలు పూలు జల్లుతూ, మంగళ హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

తర్వాత శారీరక ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇతిహాస సంకలన సమితి భాగ్యనగర్ ప్రధాన కార్యదర్శి ఇందు శేఖర్​మాట్లాడుతూ.. హిందూ సమాజ అభివృద్ధే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. కులం, ప్రాంతం, భాష భేదాలన్నీ పక్కనబెట్టి సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ విజయ్ కుమార్, మహిషా నగర సంఘ్ చాలక్ సాదుల కృష్ణదాస్, ముఖ్య వక్త డాక్టర్ గాడే మహేశ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్, బాల్కొండ పాలక్ రామారావు పటేల్, హిందూ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.