- కొద్దిరోజులుగా మొరాయిస్తున్న సర్వర్లు
- గంటల తరబడి దరఖాస్తుదారుల పడిగాపులు
- స్లాట్ బుకింగ్‌కోసం గంటల నిరీక్షణ
- ఫీజు చెల్లించినా ‘ఎర్రర్’ మెసేజ్
- డేటా అప్డేటింగ్ వల్లే లేట్ అవుతుందంటున్న అధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లో కొద్దిరోజులుగా ఆన్లైన్సేవల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్, లైసెన్స్ రెన్యూవల్ వంటి సేవలు కేవలం నిమిషాల్లో పూర్తవుతాయని అధికారులు గతంలో ప్రకటించారు. ఈ మేరకు నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో సారథి సేవలను ఇటీవల ప్రారంభించారు. వాహనాల రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పులు వంటి సేవలకు త్వరలో వాహన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇలా సారథి, వాహన్ పోర్టల్స్ ద్వారా ఆర్టీఏ సేవలన్నింటినీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టామని అధికారులు గత కొన్ని రోజులుగా చెబుతున్నారు. ఇప్పటికైతే సారథి సేవలను ప్రారంభించిన అధికారులు లర్నింగ్ లైసెన్స్‌తోపాటు కొత్త పర్మినెంట్ లైసెన్సులు కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో ఈ ఆన్లైన్ సేవల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. స్లాట్ బుకింగ్ చేసుకుంటే సక్సెస్ కావడానికి గంటల సమయం పడుతోంది. లర్నింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసినా అదే పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు ఫీజు చెల్లించిన తర్వాత కూడా ‘ఎర్రర్’ అని మెసేజ్ వచ్చి సేవ అందకుండా పోతోందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తిప్పలు తప్పించుకునేందుకు లైసెన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా చేయించుకుంటే పనులు చాలా త్వరగా పూర్తవుతున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏజెంట్లు ఒక్కో సేవకు ఒక్కో రేటు వసూలు చేస్తూ లాభపడుతున్నారు.
కేంద్ర సర్వర్ లోకి డేటా అప్లోడింగ్
ఆర్టీఏ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్న విషయంపై అధికారులు రకరకాల సమాధానాలు చెబుతున్నారు. ముఖ్యంగా సారథి, వాహన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సర్వర్లోకి రాష్ట్రంలోని ఆర్టీఏ డేటాను అప్‌లోడ్‌చేసే పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పనులు జరుగుతున్న కారణంగానే ఆన్లైన్ సేవల్లో కొంత ఆలస్యం అవుతోందంటున్నారు. ప్రస్తుతం సారథిలో మాత్రమే ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. అంటే లర్నింగ్లైసెన్స్కోసం దరఖాస్తులు, పర్మినెట్లైసెన్స్ల జారీ, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ కోసం ఆన్లైన్సేవలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
