మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి : ఆర్టీసీ ఉద్యోగులు

మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి : ఆర్టీసీ ఉద్యోగులు
  • ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేసిన తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులు 

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీలో  చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని టీజీఎస్ఆర్టీసీ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.  సీఎం రేవంత్​రెడ్డి చొరవ తీసుకొని తమకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేద్రంలో దుగ్గు రాజేందర్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఆర్టీసీ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బాగేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా దుగ్గు రాజేందర్, ఉపాధ్యక్షుడిగా వైపీ.రావును ఎన్నుకున్నారు. 

చీఫ్​గెస్ట్​లుగా లేబర్ కోర్ట్ సీనియర్ న్యాయవాదులు మోహన్ రావు, సత్యనారాయణ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమార స్వామి హాజరై మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇస్తామని చెప్పారన్నారు. ఆ హామీని నెరవేర్చకపోగా చిన్న పొరపాట్లకు  ఉద్యోగులను, కార్మికులను విధుల నుంచి తొలగించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.